calender_icon.png 1 May, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సు నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం

01-05-2025 04:06:36 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(BRS Working President Kalvakuntla Taraka Rama Rao) హాజరుకానున్నారు. జూన్ 20-21వ తేదీల్లో  ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ (Oxford India Forum Conference)సమావేశాలకు ముఖ్యవక్తగా రావాలంటూ ఆ సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ప్రొఫెసర్లు, వివిధ దేశాల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల సమక్షంలో భారతదేశ ప్రగతిపథాన్ని, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్‌ను కేటీఆర్ వివరించనున్నారు.

భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠీ (Oxford India Forum Founder Sidharth Sethi)తెలిపారు. కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా ఉంటడంతో పాటు భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అవ్వడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని సిద్ధార్థ్ సేఠి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంతో పాటు భారత్‌లోని స్థిరమైన అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ సదస్సులో కేటీఆర్ పాల్గొంటే రాబోయే రోజుల్లో ప్రపంచంపై  ఇండియా చూపే సానుకూల ప్రభావాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటొచ్చని సిద్ధార్థ్ సేఠి వివరించారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, సదస్సుకు రావాలని సిద్ధార్థ్ ప్రత్యేకంగా కోరారు. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సమావేశం యూరప్‌లో భారత్‌కు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమమని, భారత్‌ను ప్రపంచానికి దగ్గర చేయడం, పరిశోధన, సాంకేతికత, విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరమ్ ప్రధాన లక్ష్యమని సిద్ధార్థ్ సేఠి పేర్కొన్నారు.