01-05-2025 03:46:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా జగరదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని ముఖ్యమంత్రి అక్కసు వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ గురించి కామెంట్ చేసేటోళ్లకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఒక చెంపపెట్టువంటిదని, కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ అని, పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని హెచ్చరించారు.
ఆనాడు తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదని భయంతో అని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారని విమర్శించారు. ఒక్క మంచిపని చేయని రవంత రెడ్డి పేరును ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని, సీఎం వల్ల బాధించబడ్డ వారే ఆయనను ఓడించేందుకు గుర్తు పెట్టుకుంటారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్సే విలన్ అని, ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పతకం వేస్తుందన్నారు. తెలంగాణ మాలిదశ ఉద్యమ సమయంలో 359 మందిని కాల్చిచంపిన పాపం కాంగ్రెస్ ది అని, కేసీఆర్ దీక్ష సమయంలో విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా..? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే ముమ్మాటికీ తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్సే అని పేర్కొన్నారు.
ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలను ప్రజలంతా స్వాగతించిండ్రని, పదవి రాగానే సోనియాని బలి దేవతన్న మాటలు మరచిపోయావా? అని అడిగారు. తెలంగాణలో పదవులను అనుభవిస్తూ ఆంధ్రాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు అని, తెలంగాణ ద్రోహుల కొమ్ముకాసేటోళ్లకు మన అభివృద్ధి కూడా బ్రమే అని ఎద్దేవా చేశారు. అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిదని, పదేండ్లు మాదే అధికారమన్న వాళ్లకి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉంటే భయమెందుకు అన్నారు. ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో గ్యారెంటీ లేని సీఎం రేవంత్ అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయలేకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ పై చిల్లర మాటలు మాని హామీల అమలుపై దృష్టి పెట్టండని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెల్లడించారు.