12-08-2025 12:22:01 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంపై(Phone Tapping Scandal) తనపై తప్పుడు, నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (Kalvakuntla Taraka Rama Rao) లీగల్ నోటీసు పంపారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులు పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు.
బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలలో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని నోటీసులో ఆరోపించారు. కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకే బండి సంజయ్ పదే పదే అడ్డగోలుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వలన కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్ అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారని అయితే బండి సంజయ్ మాటిమాటికి చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకు కూడా ఎలాంటి సాక్షాధారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడుగా కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడి పైన అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేయడానికి లీగల్ నోటీసులు(legal notice) న్యాయవాదులు ప్రస్తావించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో స్పష్టం చేశారు. బండి సంజయ్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కేటీఆర్, అతని కుటుంబ సభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఏడు రోజులలోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణల వల్ల కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు.