16-11-2025 05:34:53 PM
హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం చేస్తున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా, దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందన్నారు. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెబుతూ కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు జిన్నింగ్ మిల్లుల పైన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వలన జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభం కాకపోవడం కూడా రైతుల విక్రయాలకు ఆటంకంగా మారిందని విమర్శించారు. ఇప్పటికీ పలు జిల్లాల్లో పత్తి కొనుగోలు ఆగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిన్నింగ్ మిల్లుల కేటగిరీల విభజనను నిరసిస్తూ మరోవైపు రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు మరోసారి బందుకు పిలుపునిచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. నెల రోజుల్లో సీసీఐ కేవలం 1.12 లక్షల టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ సీజన్‌లో అంచనా వేసిన 28.29 లక్షల టన్నుల ఉత్పత్తితో పోలిస్తే ఇది అత్యంత స్వల్పమని ఎత్తి చూపారు.
కేవలం రాజకీయాలపైనే దృష్టి సారించకుండా, రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన రైతుల పక్షన డిమాండ్ చేశారు. మొత్తం 325 జిన్నింగ్ మిల్లులకు గాను 256 మిల్లులు మాత్రమే ఓపెన్ చేసి, మిగిలిన వాటిని కూడా తెరవకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వాల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రైతులు తమ పత్తిని అమ్ముకునేందుకు కపస్ మొబైల్ యాప్ ఖచ్చితంగా వినియోగించాలన్న నిబంధన సడలించాలని, రైతులు పత్తి ఎప్పుడు తీసుకువస్తే అప్పుడు కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలోని పత్తి రైతన్నల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండికి వేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రుల బృందం ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. వెంటనే కేంద్రంపైన ఒత్తిడి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేశారు.