31-07-2024 12:05:24 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. రెవెన్యూ మిగులు ఉంటే జీతాలు ఎందుకు ఆలస్యంగా ఇచ్చారో చెప్పాలని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అద్భుతంగా ఉన్న మిగులు నిధులను ఎక్కడికి మళ్లించారో కేటీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 14.65 లక్షల కోట్లకు ఆదాయం పెంచాం, తలసరి ఆదాయంలో మన రాష్ట్రమే నంబర్ వన్ అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ ముందుందన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్ తలసరి ఆదాయంతో పోటీ పడుతున్నామని స్పష్టం చేశారు. కరోనాతో ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కరోనా ముందు మేం కూడా జీతాలు సక్రమంగానే ఇచ్చామన్నారు.
రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగవద్దని అనుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సాయం ఆపకూడదని నిధులు మళ్లించి ఉండవచ్చని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు లేవు.. మా పాలనలో అప్పులు.. రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. మేం చేసిన నికర అప్పు రూ. 3,85,340 కోట్లు మాత్రమేనన్నారు. మేం చేసిన అప్పులు చెప్పనవాళ్లు.. మేం ఇచ్చిన ఆస్తుల గురించీ చెప్పాలన్నారు. సంపద చూసే ఎవరైనా అప్పులు ఇస్తారు. జీఎస్ డీపీలో మన రాష్ట్రం మంచిస్థానంలోనే ఉందని ఆయన వెల్లడించారు. రైతు రుణమాఫీ కోసం మీరు పడుతున్న కష్టాలు తమకు తెలుసన్నారు. నిధులు సమకూర్చకోవడం ఎంత కష్టమో తమకు తెలుసని పేర్కొన్నారు.