calender_icon.png 2 November, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలి.. నిలిచిన విప్లవ స్మృతి

02-11-2025 12:36:25 AM

వీరుల స్మారకార్థం హుస్నాబాద్ 1990లో స్థూప నిర్మాణం

  1. స్థూపం విధ్వంసమై రెండున్నర దశాబ్దాలవుతున్నా.. వీరుల త్యాగాల చరిత్ర నేటికీ సజీవమే
  2. చిహ్నాన్ని పునరుద్ధరించాలని స్థానికుల డిమాండ్

అది.. భారీ స్మారక స్థూపమే కాదు..  భూస్వామ్య వర్గాల నుంచి పీడిత ప్రజలకు విముక్తి కల్పించేందుకు పోరాడి అసువులు బాసిన అమరుల స్మారకార్థం. ఈ నిర్మాణం కేవలం నివాళిగా మాత్రమే కాక, ఆ ప్రాంతంలో విప్లవ ఉద్యమం సాధించిన తాత్కాలిక విజయానికి, సార్వభౌమాధికార ప్రకటనకు ప్రతీకగా నిలిచింది.  88 అడుగుల ఎత్తులో నిర్మించిన ఆ స్థూపం..  1972వ సంవత్సరం నుంచి 1989 మధ్యకాలంలో అమరులైన 88 మంది పీపుల్స్ వార్ వీరుల స్మారకార్థం, ఒక్కొక్కరికి ఒక అడుగు అన్నట్లుగా రూపుదిద్దుకుంది.

రాజస్థాన్ నుంచి నల్ల గ్రానైట్ రాయిని తెప్పించి 110 కిలోల బరువు కలిగిన భారీ సుత్తి కొడవలి చిహ్నాన్ని స్థూపంపైన ఏర్పాటు చేశారు. ఇది నల్లటి స్తూపంపై ఎర్రటి విప్లవ ఆశయాలకు సంకేతంగా నిలిచింది.. అదే 1990వ సంవత్సరం అక్టోబరు 25న అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని హుస్నాబాద్‌లో జరిగిన ఒక అసాధారణమైన బహిరంగ ఆవిష్కరణ కార్యక్రమం. అప్పటి పీపుల్స్వార్ (పీడబ్ల్యూజీ) ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజుగా మిగిలిపోయింది. 

ఆసియా ఖండంలోనే రెండోదిగా..

హుస్నాబాద్‌లోని స్మారక స్థూపం  చైనాలోని తియన్మాన్ స్కైర్ తర్వాత ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద అమరవీరుల స్మారక స్థూపంగా గుర్తింపు పొందింది. ఈ ప్రపంచ స్థాయి పోలిక, స్థానిక పోరాటాన్ని ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాల పరంపరలో ఉంచాలనే పీపుల్స్ వార్ వ్యూహాత్మక ఆశయాన్ని సూచించింది. ఈ స్థూపం నిర్మాణం విప్లవ ఉద్యమం పట్ల ప్రజల అచంచలమైన విశ్వాసానికి ప్రబల నిదర్శనం.

1989 నుంచి ఏడాదిపాటు, పీపుల్స్వార్ ప్రతినిధులు, సానుభూతిపరులు, మిలిటెంట్లు, రైతులు, కూలీలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, ‘పైసా-పైసా’ కూడబెట్టి సుమారు రూ.12 లక్షలు (నాటివిలువ ప్రకారం) సేకరించి ఈ ని ర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ అద్భుతమైన కృషి, పీడబ్ల్యూజీ ఆ ప్రాంతంలో తాత్కాలి కంగా తమ‘ప్రజాసార్వభౌమాధికారా న్ని’ప్రకటించిందనడానికి భౌతిక ఆధారం. 

సామ్రాజ్య గుండెపై విప్లవ స్థూపం

హుస్నాబాద్ స్థూపం నిర్మాణం దాని భౌగోళిక స్థానం కారణంగా రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. పీపుల్స్‌వార్ నాయకత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక సుస్పష్టమైన వ్యూహం ఉంది. ఇది కేవలం స్థానిక తిరుగుబాటు కంటే అధికంగా, కేంద్ర అధికారానికి ప్రత్యక్ష సవాలైంది. హుస్నాబాద్ కరీంనగర్, హనుమ కొండ, సిద్దిపేట, జనగామ జిల్లాల మధ్య కూడలిలో ఉంది. 

నిర్మాణం, నాయకత్వం

ఈ స్మారక స్థూపాన్ని అప్పటి పీపుల్స్ వార్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సందెవేని రాజమౌలి అలియాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్మించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించడంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి అమరుడైన మాసాని రవీందర్ తల్లి పాలుపంచుకోవడం. ఈ నిర్మాణానికి కేవలం రాజకీయ కోణమే కాకుండా, విప్లవ స్మృతితో పాటు తల్లిదండ్రుల భావోద్వేగాలను, వ్యక్తిగత త్యాగాన్ని కూడా జోడించింది. స్థూపం నిర్మాణం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించినప్ప టికీ, పీడబ్ల్యూజీ వాటిని ఎదుర్కొని పూర్తి చేసింది. 

నెత్తుటి ధారకు ప్రతీకారం.. విధ్వంసం

హుస్నాబాద్ స్థూపం జీవితకాలం కేవలం 10 సంవత్సరాలు (1990 నుంచి 2000 జనవరి వరకు). దాని విధ్వంసం పీడబ్ల్యూజీ చరిత్రలో ఒక మలుపుగా మారింది. రాష్ట్ర అధికారాన్ని సవాలు చేసిన ఆ చిహ్నాన్ని తుడిచివేయడానికి జరిగిన ప్రతీకార చర్యలకు ఈ విధ్వంసం పరాకాష్ఠ.

ఈ క్రమంలో 1991 డిసెంబరు 19న అక్కన్నపేట మండలం రామవరం వద్ద జరిగిన మందుపాతర పేలుడులో సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్ విల్సన్ సహా మరికొందరు మరణించిన తర్వాత, పోలీసులు తరచుగా ఈ స్థూపం మీదనే పగ తీర్చుకునేవారు. ఈ ఘటనల అనంతరం, స్థూపాన్ని పాక్షికంగా దెబ్బతీయడానికి మూడుసార్లు ప్రయత్నాలు జరిగా యి. జనవరి 2000లో ఈ స్థూపం పూర్తిగా ధ్వంసమైంది.

‘గ్రీన్ టైగర్స్’ మానసిక యుద్ధం

స్థూపాన్ని ‘గ్రీన్ టైగర్స్’ పేరుతో డిటోనేటర్లు పెట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. ‘గ్రీన్ టైగర్స్’ వంటి యాంటీ-నక్సలైట్ గ్రూపుల ఉపయోగం, రాష్ట్రం ప్రతీకార, మానసిక యుద్ధ వ్యూహంలో భాగం. ప్రభుత్వ సంస్థలు కాకుండా ఈ ప్రాక్సీ గ్రూపును ఉపయోగించడం ద్వారా, రాష్ట్రం తమ అధికారిక పాత్రను దాచిపెట్టి, ప్రజాస్మృతి చిహ్నాన్ని ధ్వంసం చేసినందుకు విమర్శల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. రాష్ట్రం తర్వాత విప్లవకారుల జ్ఞాపకశక్తిని, వారి త్యాగాల చట్టబద్ధతను సామూహికంగా చెరిపివేతకు ప్రయత్నించింది.

నేలమట్టమైనా.. నిలిచిన జ్ఞాపకం

హుస్నాబాద్ స్థూపం నిర్మాణం, విధ్వంసం, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం శక్తి, దానికి వ్యతిరేకంగా రాష్ట్రం తీవ్రమైన ప్రతిస్పందనను స్పష్టంగా సూచించే ఒక సంక్షిప్త చారిత్రక ఘట్టం. భౌతికంగా స్థూపం నేలమట్టమైనప్పటికీ, దాని చారిత్రక ప్రాముఖ్యం, భావోద్వేగ ప్రభావం చెక్కుచెదరలేదు. ఈ ప్రాంత ప్రజలు ఆ నేలమట్టమైన శిథిలాలను తమ ఇండ్లలో ఉంచుకొని, నాటి జ్ఞాపకాలను సజీవం గా ఉంచుకున్నారు.

రాష్ట్రం ఒకే ఒక కేంద్రీకృత చిహ్నాన్ని ధ్వంసం చేయగలిగింది, కానీ ప్రజలు ఆ శిథిలాలను సేకరించడం ద్వారా, స్థూపం జ్ఞాపకశక్తిని వేలాదిగా వికేంద్రీకరిం చారు. 35 ఏండ్లు గడిచినప్పటికీ, ఈ ప్రాంత ప్రజలు అమరుల త్యాగాలను స్మరిస్తూ స్థూపాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.   మేకల ఎల్లయ్య, హుస్నాబాద్

అధికారుల అపహరణ..ఎర్రజెండా రెపరెపలు  

స్థూపావిష్కరణకు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పీపుల్స్‌వార్ రాష్ట్రంపై తమ పట్టును ప్రదర్శించడానికి ప్రత్యక్ష సంఘర్షణ మార్గాన్ని ఎంచుకుంది. ఈ ఘట్టం హుస్నాబాద్ స్థూపం చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ పరాకాష్ఠగా నిలిచింది. ఆవిష్కరణకు ఆటంకం కల్పించవద్దని డిమాండ్ చేస్తూ, స్థానిక దళం అప్పటికక్కడ పనిచేస్తున్న కీలక అధికారులైన వయోజన విద్య ప్రాజెక్టు అధికారి శేషుకుమార్, ఏఈ బాల్ లింగారెడ్డి,  తహసీల్దార్ రాజమౌళిని కిడ్నాప్ చేసింది.

ఈ కిడ్నాప్ చర్య పీడబ్ల్యూజీ సమాంతర పాలనా వ్యవస్థ ఎంత బలంగా ఉందో స్పష్టంగా ప్రదర్శించింది. ఈ సంక్షోభం తీవ్రత అప్పటి కరీంనగర్ కలెక్టర్ కథనం ద్వారా ధ్రువీకరించబడింది. చివరికి స్థానిక దళం డిమాండ్‌కు తలొగ్గి, అక్టోబరు 25, 1990న ఎర్రజెండా రెపరెపల మధ్య స్థూపావిష్కరణ జరిగింది.

అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి..

స్మారక స్థూప ఆవిష్కరణ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పోరుబాటలో అమరుడైన పులిరాములు తండ్రి ఈ స్థూపాన్ని ఆవిష్కరించడం ద్వారా, ఈ నిర్మాణం త్యాగానికి, కుటుంబ బాధకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అంతేకాక ప్రజాయుద్ధ్దనౌక గద్దర్, విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకులు వరవరరావు, బాలగోపాల్, శ్రీమన్నారాయణ వంటి ప్రముఖ మేధావులు హాజరై అమరవీరుల త్యాగాలను వివరించారు.

మేధావులు, కళాకారుల భాగస్వామ్యం, ఈ సంఘటనకు కేవలం రాజకీయ కోణాన్ని మాత్రమే కాక, చారిత్రక, సాంస్కృతిక సమర్థనను జోడించింది. ఈ స్మారక చిహ్నం ప్రాంతీయ సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వేర్పాటు వాద సంస్థ అయిన జేకేఎల్‌ఎఫ్ నాయకుడు యాసీన్ మాలిక్ సైతం ఈ స్థూపాన్ని సందర్శించి పరవశించడం, దేశంలోని వివిధ అణచివేత వ్యతిరేక ఉద్యమాల దృష్టిని హుస్నాబాద్ కేంద్రంగా ఆకర్షించినట్లు సూచిస్తుంది.