02-11-2025 12:32:34 AM
వివిధ సబ్జెక్టుల్లో 15 పీజీలు పూర్తి చేసిన డాక్టర్ బండి శ్రీకాంత్
ఫిషరీస్, సెరికల్చర్, అనిమల్ డైవర్సిటీ, ఎంటమాలజీ అంశాలపై నాలుగు పుస్తకాల ప్రచురణ
‘ ఓ వైపు నేనున్నానని భరోసా ఇచ్చే తండ్రి దూరమైనా.. కుటుంబ పోషణకు తల్లి పడుతున్న కష్టాలను ఎలాగైనా దూరం చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువే భవసాగరం దాటించగలదని తల్లి విశ్వాసాన్ని నిజం చేయాలనుకున్నాడు.. చట్టుముడుతున్న సమస్యలకు వెరవకుండా ఉన్నత చదువులు అభ్యసించి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను పీజీలు పూర్తి చేసి ‘పట్ట’భద్రుల రారాజు’గా నిలిచాడు.. డాక్టర్ బండి శ్రీకాంత్. అంతటితో ఆగకుండా అనునిత్యం పరిశోధనలు కొనసాగిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని రావురుకుల గ్రామానికి చెందిన బండి శ్రీకాంత్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాడు. 2006లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశాడు. 2008లో ఉస్మానియా యూనివర్సిటీలో జంతు శాస్త్రంలో పీజీ పూర్తి చేసి, 2012లో యూనివర్సిటీ మొదటి ర్యాంక్‌తో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాకతీయ యూనివర్సిటీలో ఎంఈడీ పూర్తి చేశాడు.
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం, సోషియాలజీలలో పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జంతు శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. 8 సంవత్సరాలుగా వివిధ డిగ్రీ, బీఈడీ కళాశాలలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్‌లలో జువాలజీ, సోషియాలజీ, సైకాలజీ, జర్నలిజంలో అధ్యాపకుడిగా పని చేస్తూన్నాడు. ఒకవైపు అధ్యాపకుడిగా పనిచేస్తూనే జర్నలిస్ట్ గా పనిచేశారు.
ఉద్యోగార్థులకు మార్గదర్శకునిగా..
వివిధ యూనివర్సిటీల్లో ఎంఏ ఇంగ్లీష్ ,ఎంఏ రూరల్ డెవలప్మెంట్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ సైకాలజీ, లైబ్రరీ సైన్స్ లో పీజీ పూర్తి చేశాడు. 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేశాడు. జంతు శాస్త్రంలో ఎంటమాలజీ, ఫిషరీస్ , క్యాన్సర్ సేల్స్, పెస్ట్ మేనేజ్మెంట్ ,అగ్రికల్చర్ ఎంటమాలజీ తదితర అంశాలపై పరిశోధనలు చేశాడు. ఇప్పటివరకు 15 ఇంటర్నేషనల్ జర్నల్స్ లో శ్రీకాంత్ చేసిన పరిశోధనల ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి.
సైన్స్ లో ప్రముఖ జర్నల్ ఎల్స్వేర్ ఇంటర్నేషనల్ జర్నల్ లో తాను సౌదీ అరేబియాకు చెందిన నలుగురు పరిశోధకులతో కలిసి బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ పై చేసిన పరిశోధన పత్రం ప్రచురితం అయ్యింది. ఇప్పటివరకు సెరికల్చర్, ఎంటమాలజి, అక్వాకల్చర్ అంశాలపైన ఐఎస్ బిఎన్ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్)తో నాలుగు పుస్తకాలు రచించాడు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలు నూతనంగా రూపొందించిన డిగ్రీ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం సిలబస్ ఆధారంగా అనిమల్ డైవర్సిటీ-ఇన్వర్టీబ్రెట్స్ అండ్ వెర్టిబ్రేట్స్ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకాన్ని తీసుకురావడంతో రాష్ట్రంలోని జంతుశాస్త్ర అధ్యాపకులకు ఎంతగానో ఉపయోగపడింది.
ఈ పుస్తకం సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ 978-93-343-9251-7తో ప్రచురితం అయ్యింది. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. స్టడీ సర్కిల్ ద్వారా 300 మంది అభ్యర్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మార్గదర్శకుడిగా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.
మంద జనార్దన్, విజయక్రాంతి, సిద్దిపేట