26-10-2025 01:03:58 AM
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో ‘కుమారి 21ఎఫ్’ ముఖ్యమైనది. ముంబయి ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ తెలుగులో లీడ్ హీరోయిన్‌గా తొలిసారి ఈ సినిమాతోనే సూపర్ హిట్టందుకుంది. రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథనందించగా, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు.
అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుందా? అంటే, ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఫిలింనగర్ సర్కిల్ కథనాల ప్రకారం.. ‘కుమారి 21ఎఫ్’ సీక్వెల్‌కు ‘కుమారి22ఎఫ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని టాక్. ఈ సినిమాను సుకుమార్ సతీమణి తబిత తన కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించనుండటం విశేషం. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ ప్రకటన ఉండబోతుందని సమాచారం.
డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ చివరగా ‘18 పేజెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ ‘కుమారి 22ఎఫ్’ను ఆయనే డైరెక్ట్ చేస్తాడా..? లేక కొత్త దర్శకుడెవరైనా ఈ ప్రాజెక్టు బాధ్యతలు తీసుకుంటారా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. ఇక హెబ్బా పటేల్.. ఈ సీక్వెల్‌లోనూ టైటిల్ రోల్‌లో కనిపిస్తుందా? అనేది విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, సుకుమార్ ఈ సీక్వెల్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది. కాగా సుకుమార్.. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేయబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.