26-10-2025 01:02:16 AM
‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాను గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ కథలో హీరోయిన్ పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. దీక్షిత్ కూడా మంచి పేరొస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండను గెస్ట్‌గా తీసుకొద్దాం” అన్నారు.
చిత్ర కథానాయిక రష్మిక మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ కథ విన్నప్పుడు.. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అపిపించింది. నేను చాలా సినిమాలు చేస్తున్నా కానీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను. నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్‌కు చెప్పాలనే అనిపిస్తుంది. నేను నా కెరీర్‌లో రైట్ టైమ్‌లో కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది” అని చెప్పింది.
‘నేను ఈ కథ విన్నప్పుడు అందులో నుంచి బయటకు రాలేకపోయాను. దసరా సినిమాలో నేను చేసిన సూరి క్యారెక్టర్‌ను ఎంతగా ఇష్టపడ్డారో ఈ చిత్రంలోని నా పాత్ర ‘విక్రమ్’ను అంతగా ఇష్టపడతారు.. అంతకన్నా ద్వేషిస్తారు. గర్ల్‌ఫ్రెండ్‌ను ఎలా మ్యానేజ్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉన్నారో నా క్యారెక్టర్ ద్వారా చూసుకోవచ్చు’ హీరో దీక్షిత్‌శెట్టి తెలిపారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. “రిలేషన్‌షిప్ ట్రై చేయాలనుకునేవారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ను చూసి ఆ ఎమోషన్‌తో బయటకు వస్తారు. దీక్షిత్, రష్మిక తమ పర్‌ఫార్మెన్స్‌తో కథకు లైఫ్ ఇచ్చారు” అన్నారు. ‘ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా ఉంటుందీ సినిమా’ అని చిత్ర నిర్మాత విద్యా కొప్పినీడి తెలిపారు.
మరో నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ.. “కెరీర్‌లో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలనుకుంటా. వాటిలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. రష్మిక ఈ సినిమాను ఒప్పుకోవడమే మా మొదటి విజయం. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలని వెళితే, ‘సినిమా కంప్లీట్ అయ్యాక తీసుకుంటా’ అన్నారు. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరనిపించింది. రష్మిక లేకుంటే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమానే లేదు.
దీక్షిత్ మాకు దొరికిన మరో గొప్ప నటుడు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తర్వాత ఆయన టాలీవుడ్‌లో మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు’ అని చెప్పారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నేను చూశాను. చివరి 30 నిమిషాల సినిమాను మర్చిపోలేకపోతున్నా.
థియేటర్లలో కూర్చున్న అమ్మాయిల్లో 60 శాతం ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. తమ గర్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాకు వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి” అన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. “రష్మికలా డెడికేషన్, కమిట్‌మెంట్ ఉన్న హీరోయిన్‌ను నేను చూడలేదు.. ఎన్ని గంటలైనా షూటింగ్ చేస్తారు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.