17-09-2025 07:13:06 PM
రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పోరాటయోధుడు కుమ్రంభీం ఆదివాసీల ఆరాధ్య దైవమని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్ లోఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదివాసి సంఘ నాయకులతో కలిసి కుమ్రంభీం విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపిన పోరాట యోధుడు కుమ్రంభీం జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
జోడేఘాట్ ప్రాంతం చారిత్రాత్మకమైనదని, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కుమ్రంభీం మ్యూజియంలో ప్రదర్శించిన ఆదివాసీల పురాతన వస్తువులు, వారి ఆచార వ్యవహారాలు, ఆధునికతను జోడించి జీవన విధానంలో తెస్తున్న మార్పులు వంటి విషయాలను తెలుసుకోవచ్చని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి, ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. అక్టోబర్ 7న నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.