calender_icon.png 1 May, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక సూర్యులు

01-05-2025 12:00:00 AM

చూపుడు వేళ్లు సంతకాలు చేస్తేనే..

కాలచక్ర యంత్రాలు తిరిగేవి 

చెమట చుక్కల నదులు పొంగితేనే

ముడిసరుకుల చక్రాలు కదిలేవి  

కార్మిక కర్షక అడుగులు పడితేనే

కాలగమన సోపానాలు నిద్రలేచేవి 

దేహపు కండరాలు కరిగిస్తేనే

ప్రపంచ చక్రాలు ముందుకు నడిచేవి 

జీవన సౌరభాల విత్తనాలను మొలకెత్తిస్తేనే

బతుకు పోరాట ఆటలు గెలిచేవి

శ్రమ జీవనపు ఆశయాల్ని తాకట్టు పెట్టి

మానవత్వం లేని విలువలను మూటకట్టి

నడుస్తున్న ఒంటెద్దు పోకడలపై

చెదలు పట్టిన చీడ పురుగుల్నీ

నాశనం చేసి విప్లవాగ్నిని రగిల్చే

ఆత్మవిశ్వాసపు దివిటీలు.. కార్మికులు 

ఉప్పెనలా రెక్కలతో రక్తం చిందిస్తూ..

ఉక్కు పిడికిలితో చైతన్యరథాన్ని నడిపిస్తూ..

మనసు పాదాలతో అహర్నిశలు శ్రమిస్తూ..

రేయింబవళ్లు ఊపిర్లకు 

ఆయుష్షు పోస్తూ.. గుండెబరువును 

మండేసూర్యుడిలా వెలిగిస్తూ..

కాలం గాయాల వేటును తట్టుకొని

నిలబడే నిఖార్సయిన 

సౌందర్య కిరీటాలు కార్మికులు 

తూర్పున సింధూరం తిలకం దిద్దిన

పడమటిన సంధ్యారాగం పాడిన

గొంతునుంచి రుధిరభాష్పాలు రాలిపడిన

గనులు కొలనులో బురద చల్లిన

రేపటి సూర్యతేజ కిరణమై

నిండు వెలుగులను ప్రసాదించే

గొప్ప హృదయం గల ధిక్కార స్వరాలు

నేటి ‘మే’టి కార్మిక సూర్యులు!

 డాక్టర్ పగిడిపల్లి సురేందర్