calender_icon.png 28 May, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రమజీవుల ఆశలు చిగురించేనా?

01-05-2025 12:00:00 AM

డాక్టర్ కోలాహలం రామ్‌కిశోర్ :

నేడు కార్మిక దినోత్సవం :

‘మే డే’ సందర్భంగా ప్రపంచమంతా కార్మికుల హక్కులు, గౌరవం కోసం పోరాటాలను గుర్తు చేసుకుంటున్న రోజుల్లో భారతదేశపు పారిశ్రా మిక, వ్యవసాయ కార్మికుల పరిస్థితులు మాత్రం రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నాయి. గత దశాబ్దంలో ఆర్థిక వృద్ధి, విధాన సంస్కరణలు జరిగినప్పటికీ కోట్లా ది కార్మికుల జీవితాల్లో మార్పు రాలేదు.

బదులుగా, నిరుద్యోగం, అనధికారిక ఉద్యోగాల వృద్ధి, వ్యవసాయ సంక్షోభం వంటివాటి వల్ల అసమానతలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఆర్థిక సవాళ్లు కార్మికులను  అసహాయ స్థితిలోకి నెట్టివేశాయి. ఉపాధిని ఇచ్చే ప్రధాన వనరు అయిన పారిశ్రామిక రంగం కూడా ఇప్పుడు సురక్షితమైన జీవనోపాధిని అందించలేకున్నది.

2022--23లో జరిగిన ’పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం దేశంలో 90 శాతం కార్మికులు అనధికారిక రంగంలో పని చేస్తున్నారు. వీరికి ఉద్యోగ, సామాజిక భద్రత లేదు. ఇంకా అనేక కంపెనీలు శాశ్వత ఉద్యోగాలకు బదులు కాంట్రాక్ట్ కార్మికులను నియమించి, కార్మిక చట్టాలలోని రక్షణలు, హక్కులు వారికి దక్కకుండా అణచి వేస్తున్నాయి.

భద్రత నుంచి వేతనాల వరకు!

2020లో ప్రవేశపెట్టిన కొత్త కార్మిక సంబంధ చట్టాలు వారి రక్షణను మరింత బలహీన పరిచాయి. 44 శ్రమ చట్టాలను నాలుగు కోడ్‌లలో కలిపేశారు. దాంతో ఉద్యోగ దాతలకు కార్మికులను సులభంగా పని నుంచి తొలగించే అవకాశం లభించింది. ఇది యూనియన్ల ఐక్యతా శక్తినీ తగ్గించింది.

2020లో విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ వద్ద జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించారు. ఇది కర్మాగారాలలో భద్రతా ప్రమాణాలు ఎంత తక్కువగా పాటించడం జరుగుతున్నదో తెలియజేసింది. ప్రభుత్వ సమాచారం ప్రకారం 2017 నుంచి 2021 మధ్య కర్మాగార ప్రమాదాల్లో 1,100 కంటే ఎక్కువమంది మరణించారు.  

కార్మికుల వేతనాలు కూడా చాలా నెమ్మదిగా పెరిగాయి. అంతర్జాతీయ కార్మి క సంస్థ (ఐఎల్‌ఓ) 2023లో వెల్లడించిన నివేదిక ప్రకారం, 2015 నుంచి 2022 మధ్య కాలంలో భారతదేశంలో నిజమైన వేతనాలు సంవత్సరానికి కేవలం 1.5 శా తం మాత్రమే పెరిగాయి. ఇది ఉత్పాదకత పెరుగుదలకంటే చాలా తక్కువ.

ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గింది. కోవిడ్--19 సమయంలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, లక్షలాది మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి, నిరాశ్రయులై తమ గ్రామాలకు వెళ్లడానికి కాలి నడకన నానా కష్టాలు పడ్డారు. కేంద్రం చెవులు ముడుచుకొని చోద్యం చూసింది.

దిగజారుతున్న రైతుల బతుకులు

---------భారతదేశంలో 45 శాతం కార్మికులు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. కానీ, ఈ రంగం నిరంతర సంక్షోభంలో మునిగిపోయింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం, 2014 నుంచి ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల వాగ్దానాలు చేసినప్పటికీ, గ్రామీ ణ వేతనాలు స్థిరంగా ఉన్నాయి. రైతులకు ముఖ్యమైన ’మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాని’ (ఎంజీఎన్‌ఆర్‌ఇజీఏ)కి నిధులు గణనీయంగా తగ్గించారు. వేతనాలు ఆలస్యంగా చెల్లించడం, పని రోజులు తగ్గించడం వంటి సమస్యలు అనేకం ఉన్నాయి.  

202-21లో మూడు ప్రాణాంతక వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం తెస్తే వాటికి వ్యతిరేకంగా రైతులు సుధీర్ఘ కాలం ఉద్యమించి ప్రపంచ రికార్డును సాధించారు. అతి కష్టమ్మీద కేంద్రం పార్లమెంటు లో రైతులకు క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను రద్దు చేసింది. కానీ, చిత్తశుద్ధితో చేసినట్లు లేదు. ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయి.

తక్కువ ధర లు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, రైతుల ఋణభారం ఇంకా పరిష్కారం కాలేదు. వాతావరణ మార్పులు కూడా రైతుల పరిస్థితిని మరింత దిగజార్చాయి. 2022లో వచ్చిన వేడిగాలులతో గోధుమ దిగుబడి 15 శాతం తగ్గింది. భూమి లేని వ్యవసాయ కార్మికులు అత్యంత బీదలుగా మిగిలిపోయారు.

కుల, మత, జాతి ఆధారిత వివక్షత కూడా వారి పరిస్థితిని మరింత ఘోరంగా మార్చింది. దళిత, ఆదివాసీ కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం, బంధన కూలీ వ్యవస్థ వంటి అన్యాయాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ చట్టాల ప్రకారం, 65 శాతం వ్యవసాయ కార్మికులు కనీస వేతనం కంటే తక్కువ సంపాదిస్తున్నారు.  

సంస్కరణలకు పెద్దపీట వేయాలి!

------గత దశాబ్దంలో, ఆర్థిక వృద్ధి పేరుతో కార్మికుల హక్కులను బలహీన పరిచే వ్యూ హం అమలు జరిగినట్టు కనిపిస్తున్నది. కార్పొరేట్ స్నేహపూర్వక విధానాలు కార్మికుల శ్రేయస్సును త్యాగం చేస్తున్నాయి. ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్’ (ఇఎస్‌ఐసీ), ‘ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధాన్’ (పీఎంఎస్‌వైఎం) వంటి సామాజిక భద్రతా పథకాలు చాలామంది అనధికారిక కార్మికులకు చేరడంలో విఫలమయ్యాయి.

‘మే’డే నిజమైన ఆత్మ ను గౌరవించాలంటే, భారతదేశంలోని ప్ర భుత్వాలన్నీ కార్మికుల హక్కులపై దృష్టి పెట్టాలి. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ చట్టాన్ని’ మరింతగా బలోపేతం చేయాలి. వేతనాలను సకాలంలో చెల్లిస్తూ, కార్మికుల భద్రతా చట్టాల ను కఠినంగా అమలు చేయడం అత్యవసరం. అసంఘటిత రంగాన్ని శ్రమ రక్షణ లోకి తెచ్చి సమగ్ర విధానం అమలు పరచాలి. తక్షణమే సంస్కరణలు చేపట్టాలి.

వ్యాసకర్త సెల్: 9849328496