calender_icon.png 23 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా నా డోంట్ కేర్...

23-12-2025 09:13:36 PM

ప్రభుత్వ స్థలంలో ఇష్టరీతిన గదుల నిర్మాణాలు

అధికారులకే సవాల్ విసురుతున్న భూ బకాసురులు

విఆర్ఎల సహకారంతోనే అంటూ ఆరోపణలు

స్పందించని ఆర్ఐ

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కబ్జాలకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములపై దండయాత్ర కొనసాగిస్తుంది. కానీ కొందరు భూ బకాసురులు మాత్రం హైడ్రా ను పట్టించుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే గదులు నిర్మిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఒక్కో గదిని అమాయక ప్రజలకు లక్షల్లో అమ్ముతూ అందినకాడికి దండుకుంటున్నారు.

హైడ్రా నగరంలో వేల కోట్ల ఆస్తులను కాపాడుతున్న కూడా కొందరు అవేమి పట్టనట్టుగా ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే దుండిగల్-గండిమైసమ్మ మండల పరిధి చర్చి గాగిల్లాపూర్ సర్వే నంబర్ 214 ప్రభుత్వ స్థలంలో భూ బకాసురులు ఖాళీ జాగలను 60,80 గజాలుగా విభజిస్తూ రాత్రికి రాత్రే గదులు నిర్మిస్తున్నారు.గదులను అమాయక ప్రజలకు అమ్ముతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ గదులపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు. అయితే ఈ తతాంగం వెనుక సంబంధిత విఆర్ఎల పరోక్ష సహకారం ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

సర్వే నెంబర్ 120 లో జిఓ 59 పేరుతో...

ఇదే మండల పరిధిలోని దొమ్మర పోచంపల్లి సర్వే నెంబర్ 120 లో దాదాపు 120 గజాలలో ఓ గది రూపుదిద్దుకుంది.గతంలో అక్రమ గదిని రెవెన్యూ అధికారులు కూల్చివేతలు జరిపారు. కానీ ప్రస్తుతం చకాచకా పనులు చేస్తూ నిర్మాణం పూర్తి చేశారు. అంతకుముందు రెవెన్యూ అధికారులు ఆ గదిని కూల్చారు. ఇప్పుడేమో జిఓ 59 ఉందంటూ వత్తాసు పలకడంపై ఒప్పందాలు కుదిరాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి గదులను కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

స్పందించని ఆర్ఐ 

అయితే ప్రభుత్వ స్థలంలో అక్రమ గదులపై సంబంధిత ఆర్ఐ వివరణ కొరకు ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించడం లేదు.