30-07-2024 01:12:59 AM
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్య
ఎమ్మార్ కోసం భూసేకరణపై రైతుల పిటిషన్లు
భూసేకరణ, రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఎమ్మార్ ప్రాజెక్టు నిమిత్తం ఇద్దరు రైతుల నుంచి సేకరించిన భూమిని ఎమ్మార్, ట్రాన్స్‌కోలకు చేసి ఇచ్చిన ఒప్పందాలతోపాటు అవార్డును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రైతులకు చెందిన భూసేకరణ అవార్డుపై తిరిగి విచారణ జరిపి, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడలోని సర్వే నంబర్ 49, 48ల్లో ఇద్దరు రైతులకు చెందిన సుమారు 14 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన అవార్డును, రిజిస్ట్రేషన్, లీజు ఒప్పందాలను సవాల్ చేస్తూ రైతులు సదానందం, ఎస్ ప్రతాప్‌రెడ్డి నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. భూమి ప్రాథమిక హక్కు కాబోదని.. అయితే, భూమి మానవ హక్కు అని తీర్పులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేశారు. మానవ హక్కుల్లో ఆరోగ్య హక్కు, జీవనోపాధి హక్కు వంటి వ్యక్తిగత హక్కులు ఉన్నట్టే ఇప్పుడు ఆస్తి హక్కు కూడా మానవ హక్కేనని తీర్పులో పేర్కొన్నారు.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బీ చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మౌలిక ప్రాజెక్టుల కోసం తమ భూమిని సేకరించి ఇతర ప్రయోజనాలకు అప్పగించారని అన్నారు. అత్యవసర నిబంధన కింద భూసేకరణ చెల్లదని హైకోర్టు చెప్పడంతో తిరిగి రైతులకు తెలియకుండానే అవార్డు నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒక్కసారి భూసేకరణ చేపట్టి భూమిని స్వాధీనం చేసుకున్నాక ప్రభుత్వం ఎలాగైనా దాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. సబ్‌స్టేషన్ నిర్మాణం ప్రజాప్రయోజనంలో భాగమేనని, 2002 మధ్య సేకరించిన భూమిపై ఇప్పుడు పిటిషన్లు వేయడం చెల్లదని అన్నా రు. అంతేగాకుండా భూసేకరణ చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు చెందిన భూమికి ప్రకటించిన అవార్డు వివరాలు, స్వాధీనం చేసుకున్న వివరాలను ప్రతివాదులు సమర్పించడంలో విఫలమయ్యారని పేర్కొన్నా రు. ఇక్కడ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు రైతులకు నోటీసులు జారీ చేసిన ట్టుగానీ, సమాచారం ఇచ్చినట్టుగానీ ఆధారా లు లేవని అన్నారు.
సాధారణంగా భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు పంచనామా నిర్వహిస్తారని, అలాంటి వివరాలను ప్రతివాదులు సమర్పించలేదని చెప్పారు. కోర్టు ముందున్న ఆధారాల ఆధారంగానే నిర్ణ యం ఉంటుందని స్పష్టంచేశారు. ఎప్పుడో స్వాధీనం చేసుకున్నామని ఏపీఐఐసీ చెప్తుండగా, మరోవైపు ఇదే భూమికి సంబంధించి ప్రయోజనాలు కల్పిస్తే రోడ్డు వెడల్పు నిమిత్తం 1680 చదరపు గజాలు ఇవ్వడానికి సిద్ధమేనని జీహెచ్‌ఎంసీకి, పిటిషనర్‌కు మధ్య 2021 నవంబరులో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయని తెలిపారు. అంటే పిటి షనర్ల భూమిని ముందే స్వాధీనం చేసుకున్నామన్న వాదన అవాస్తవమని తేలుతోం దని అన్నారు. పిటిషనర్కు తెలియకుండా జారీ చేసిన అవార్డును, ఎమ్మార్, ట్రాన్స్‌కోలతో టీఎస్‌ఐఐసీ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.