calender_icon.png 13 November, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమర్షియల్ ట్యాక్స్ కాదు.. బీహారీ ట్యాక్స్!

30-07-2024 01:17:04 AM

దోపిడీ కోసం మాజీ సీఎస్ సోమేశ్ వాట్సప్ గ్రూప్  

సోమేశ్ తప్పులు..సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్లకు బిగుస్తున్న ఉచ్చులు

బీహారీ ప్రొఫెసర్ అందజేసిన సాఫ్ట్‌వేర్

అగ్రిమెంట్ లేకుండానే కన్సల్టెంట్‌కు బాధ్యతలు

సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులతో వేల కోట్ల దోపిడీ

బడా వ్యాపారులకు మేలుచేస్తూ వేల కోట్లు దారిమళ్లింపు

దోపిడీకి ఉపయోగించిన ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్‌ఫోన్‌లు సీజ్ 

సోమేశ్ స్కాంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక నజర్

విచారణ బాధ్యతలను సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 29 (విజయక్రాంతి) : మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్‌ను బీహారీ ట్యాక్స్‌గా వ్యవహరించి దోచుకున్న రూ.1400 కోట్లను కక్కించేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 75 మంది బడా పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూర్చేందుకు, సాఫ్ట్‌వేర్‌లోని డాటాలో వారి పేర్లను ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేయడాన్ని రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఈ క్రమంలోనే సోమేశ్ పాల్పడ్డ ఈ కుంభకోణంలో ఎలాంటి అగ్రిమెంట్ లేకుండానే సాఫ్ట్‌వేర్ రూపొందించిన బీహారీ ప్రొఫెసర్‌తో పాటు మరికొందరు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కూడా ఉచ్చు బిగుసుకుంటున్నది. ఇందులో కన్సల్టెన్సీ పాత్రతోపాటు బోగస్ ఇన్వాయిస్‌లతో కొల్లగొట్టిన సొమ్ము ఎంత అనే అంశాలపై  ప్రభుత్వం ఆరా తీస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో తను ఎంతచెబితే అంత అన్నట్లుగా వ్యవహరించిన మాజీ సీఎస్ అండ్ కో చేసిన రూ.1,400 కోట్ల కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టినట్లు సమాచారం. ఈ దోపిడీలో కీలకంగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు మరో నలుగురిపై ఆర్థిక నేరాల కింద కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు త్వరలోనే మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిసింది. మాజీ సీఎస్ అండ్ కో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో చేసిన దోపిడీపై అసెంబ్లీలోను చర్చించే అవకాశం ఉందని సమాచారం.

సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే..

గత ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్స్‌లో (వాణిజ్య పన్నుల శాఖ)లో వ్యవహారాలన్నీ మాజీ సీఎస్ కనుసన్నల్లోనే జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూపునకు చేరేలా సోమేశ్‌కుమార్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా మూడు గ్రూపులను తన కనుసన్నల్లో నిర్వహించిన సోమేశ్ ఒక గ్రూపులో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, మరొకటి అదనపు స్థాయి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌లు, డివిజన్ స్థాయి అధికారులు,  మూడవ గ్రూపు కన్సల్టెంట్‌ను పర్యవేక్షించే ప్రొఫెసర్‌తో పాటు ఐఐటీ విద్యార్థులతో నిర్వహించి దోపిడీ తతంగాన్ని మాజీ సీఎస్ నడిపి నట్టుగా అధికారులు గుర్తించారు. సోమేశ్ తన సొంత లాభం కోసం లోపభుయిష్టంగా ఓ బీహారీ ప్రొఫెసర్‌తో ఓ ఎలాంటి అగ్రిమెంట్ లేకుండానే నియమించుకున్న అనధికారిక కన్సల్టెంట్‌కు అధికారికంగా సుమారు రూ.100 కోట్లు చెల్లించారు.

ఎలాంటి ఒప్పందం లేకుండానే వాణిజ్య పన్నుల శాఖ నుంచి 5 సంవత్సరాల పాటు ఈ చెల్లింపులు కొనసాగాయి. ఈ కన్సల్టెన్సీ రూపొందించిన లోపభూయిష్టమైన సాప్ట్‌వేర్‌లోని లొసుగులను అడ్డం పెట్టుకొని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్‌లోని కొన్ని కంపెనీల వల్ల కమర్షియల్ ట్యాక్స్ వేయి కోట్లు నష్టం వాటిల్లడంతో పాటు మరో 11 ప్రైవేటు సంస్థలు కూడా ఇలా రూ.400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కమర్షియల్ ట్యాక్స్, ఐఐటీ హైదరాబాద్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది.  ఇందులో భాగంగా మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను, కంప్యూటర్లను సీజ్ చేయడంతో పాటు వాటిని ఫోరేన్సిక్ ల్యాబ్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆ ముగ్గురే కీలకం..

బీహార్‌కు చెందిన ఒక ప్రొపెసర్ కొందరు ఐఐటీ విద్యార్థులతో పుట్టుకొచ్చిన అనధికారిక కన్సల్టెన్సీకి కమర్షియల్ ట్యాక్స్‌కు సంబంధించి వ్యాపార లావాదేవీల బాధ్యతలను మాజీ సీఎస్ అప్పగించారు. ఈ కన్సల్టెన్సీలోని ఐఐటీ విద్యార్థులు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల డేటాను విశ్లేషించి దానికి సంబంధించిన నివేదికను తెప్పించుకున్న మాజీ సీఎస్ జీఎస్టీలో ఫేక్‌ట్యాక్స్ ఇన్‌వాయిస్‌లతో ఐటీసీలను రీఫండ్ చేసి పలువురు వ్యాపారుల నుంచి వందల కోట్లు వసూలు చేశారు. అయితే కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో జరిగే వ్యవహారాలన్ని కూడా ఓ ముగ్గురు అధికారులు మాత్రమే నిర్వహించేవారని, సీఎస్‌ను అడ్డంపెట్టుకొని ఆ ముగ్గురు కూడా అందినకాడికి దోచుకున్నట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీపై కూడా కేసు నమోదయ్యింది. 

నాలుగు రూపాలుగా పన్ను వసూలు..

ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ, సెస్‌ల వంటి నాలుగు రూపాలలో పన్నులను వసూలు చేయాలి. అయితే సోమేశ్ మౌకిక ఆదేశాల మేర కు గత ప్రభుత్వంలో సుమారు ఐదేండ్ల పాటు  ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీలను మాత్రమే వసూలుచేసి మరో రెండింటిని ఐజీఎస్‌టీ, సెస్‌లను వ్యాపారుల నుంచి వసూలు చేయలేదు. దీనిని వ్యతిరేఖించిన కొందరు అధికారులను సోమేశ్ అండ్ గ్యాంగ్ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు ట్యాక్స్‌లలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల ఆదాయం కోల్పోయినట్టుగా సమాచారం. 

అయితే సోమేశ్ సూచనల మేరకు ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ చెల్లించే సుమారుగా 80 వేల మంది వ్యాపారులకు 2017 నుంచి 2021 సంవత్సరానికి గాను నోటీసులు ఇవ్వగా వారి నుంచి సు మారుగా రూ.700 కోట్లు వసూలు అయినట్టుగా తెలిసింది. అయితే రాష్ర్టవ్యాప్తంగా ఎస్‌జీఎస్టీని చెల్లించే వ్యాపారులు రెండున్నర లక్షల మంది ఉన్నట్టుగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందులో కూడా తమ అనుకూలమైన వారికి నోటీసులు ఇవ్వకుండా వారి నుంచి సోమేష్ కుమార్ అండ్ కో పెద్ద మొత్తంలో లబ్ధిపొందినట్టు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

సీఐడీకి అప్పగింత ? 

రాష్ర్ట బేవరేజెస్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ.1,000 కోట్లు స్కాం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే  సీసీఎస్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసులో మరికొంత మందికి విచారణ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలతో ఈ వ్యవహారం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి సీసీఎస్‌ను తప్పించి సీఐడీతో కేసును దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ అధికారిగా హైదరాబాద్ సీసీఎస్ ఈఓడబ్ల్యూ(ఎకానామిక్ అఫెన్స్ వింగ్) టీమ్‌త ఏసీపీ ఎమ్.కిరణ్‌కుమార్  నియమించారు. 

సీడాక్ నివేదిక..

  1. స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట  ఏర్పాటైన వాట్సప్ గ్రూప్ సోమేశ్‌కుమార్, కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. 
  2. సోమేశ్‌కుమార్ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ గ్రూప్‌ను 2022 డిసెంబర్ లోనే నిలిపి వేశారు. 
  3. 2024 ఫిబ్రవరి వరకు ఆ వాట్సప్ గ్రూప్‌లో నిర్వహించిన కార్యకలాపాలను, చాట్ హిస్టరీని, ఫోటోలు, వీడి యోల సేకరింస్తున్నారు. 
  4. కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్ సెల్‌ఫోన్లను ఉన్నతాధికారులు జప్తు చేశారు. 
  5. ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీడాక్ తుదినివేదిక ప్రకారం 75 మంది పెద్ద పెద్ద పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలా పాల్ని ఉద్దేశపూర్వకం గా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేశారు. 
  6. వాణిజ్య పన్నుల శాఖకు, ఐఐటీ హైదరాబాద్‌కు మధ్య మాత్రమే జరగాల్సిన లావాదేవీల వివరాలు హిందూపూర్ ఐపీ అడ్రస్ చిరునామాతో ఉన్న సంస్థకు చేర్చారు. 
  7. ఆ ఐపీ అడ్రస్ పాస్‌వర్డ్ ప్లియాంటో అని ఉంది.
  8. ఐఐటీ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇని షియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేర్చారు.
  9. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌లో లోపాలున్నట్లు తమ ఆల్గరిథమ్స్ ద్వారా కనుగొన్నట్లు తొలుత శోభన్‌బాబు ఆ శాఖకు తెలియజేశారు. కానీ లోపాలకు సం బంధించిన సమాచారాన్ని వాణిజ్యపన్నులశాఖ అధికారు లకు ఇవ్వలేదు.