calender_icon.png 18 July, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంక స్నేహవారధి!

08-04-2025 12:00:00 AM

శ్రీలంకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ఫలప్రదమైంది. ఏప్రిల్ 5న భారత్, శ్రీలంక అనేక అంశాలపై ఒక సమగ్ర ఒప్పందానికి వచ్చాయి. రాజకీయ, ఆర్థిక సంక్షుభిత శ్రీలంక ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నది. అల్లకల్లోల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అనూర కుమార దిస్సనాయకె శ్రీలంకకు కొత్త దిశను కల్పిస్తున్నట్టే కనిపిస్తున్నది. వామపక్ష నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీని అనూహ్యంగా అధికార పీఠంపైకి తెచ్చిన దిస్సనాయకె పొరుగున బలమైన శక్తిగా ఉన్న భారత్‌తో సత్సంబంధాలు శ్రీలంకకు అత్యంత ప్రాధాన్యమైనవని గుర్తించారు. అందుకే శ్రీలంకలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భారత్‌లో పర్యటించారు.

శ్రీలంకను అన్ని విధాలుగా అస్తవ్యస్తం చేసి రణిల్ విక్రమ సింఘె హయాంలో ఆ దేశం చైనాకు దగ్గరై భారత్‌ను విస్మరించింది. దీనితో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అడుగంటాయి. చైనాతో శ్రీలంక అంటకాగడం భారత్‌కు భద్రత, భౌగోళికమైన ముప్పును తెచ్చి పెట్టింది. ఆసియాలోని పొరుగు దేశాలతో సౌహార్థ సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ దౌత్య విధానానికి ఇది పెద్ద సవాలుగానే పరిణమించింది. 

వామపక్ష రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన దిస్సనాయకె భారత్  శ్రీలంక మధ్య సత్సంబంధాలు నెలకొనాలనే ఆకాంక్షిస్తున్నారు.  ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను బయట పడేయాలంటే, అనేక ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న సత్సంబంధాలను తిరిగి భారత్‌తో ఏర్పర్చుకోవాలనే ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే మరో దేశపు కార్యకలాపాలను శ్రీలంకలో అనుమతించమని ఆయన స్పష్టంగా చెపుతున్నారు.

ఈ వైఖరి భారత్‌కు సంతృప్తిని కలిగించింది. శ్రీలంక ఆహ్వానం మేరకు సాగిన పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశంతో ప్రధానంగా ఏడు ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌ను విలువైన మిత్రదేశంగా శ్రీలంక మరోసారి గుర్తించిందనేందుకు ఈ ఒప్పందాలు తార్కాణం. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కుదిరిన ఈ ఒప్పందాలు పరస్పర ప్రయోజనకరంగా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ‘పొరుగు దేశానికే ప్రాధాన్యం’ అనే తమ విధానాన్ని బలంగా చెప్పారు. పాలనా పరంగా పొరుగున వున్న దేశాలు సుస్థిరంగా ఉన్నప్పుడే దక్షిణాసియా ప్రాంత దేశాలన్నీ భద్రతా పరంగా బలంగా ఉండగలుగుతాయి.

సామాజిక, సాంస్కృతిక రంగాల్లో భారత్, శ్రీలంక మధ్య తరతరాలుగా బలమైన బంధం ఉంది. శ్రీలంకలో ఆలయాల అభివృద్ధికి, పవిత్రమైన ఒక నగర నిర్మాణ కాంప్లెక్స్‌కు భారత్ అండగా ఉంటుందని ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మాటిచ్చారు. రెండు దేశాల మధ్య తిరిగి చారిత్రక, సాంస్కృతిక బంధం బలపడేందుకు ప్రధాని మోదీ పర్యటన ఎంతగానో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.