calender_icon.png 18 July, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరువు హత్యలకు ముగింపు ఎప్పుడు?

08-04-2025 12:00:00 AM

దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాం తంలో కులం లేదా ప్రేమపెళ్లి సాకుతో హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి విష సంస్కృతి దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఈ దుర్ఘటనల నివారణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం ఆందోళనకరం. దీన్నిబట్టి చూస్తే దేశాన్ని పాలకులు ఆటవిక కాలంలోకి తీసుకెళ్తున్నారా? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రజా చైతన్యం కలిగిన రాష్ట్రంలో కులం, మతం పేరుతో మూకహత్యలు, బహిష్కరణ వంటి విషసం స్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దక్షిణ భారతదేశంలో అభివృద్ధి నిత్యం కొత్త పుంతలు తొక్కుతోంది.

పిల్లల్ని కనే విషయంలో ఎవరికి వాళ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే, ‘జనాభా ఆధారంగా పార్లమెంటులో సీట్ల కేటాయింపు జరగొద్దు’ అని వాదిస్తున్నా రు. ఇలా ఆలోచించడం గొప్ప విషయమే. ఇటువంటి సమాజంలో జీవిస్తూ కులం, మతం, పరువు పేరుతో పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కొందరు హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఈ తీరు నిజంగా దిగ్భ్రాంతికరం. ఏ కారణాలవల్ల అయినా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు, ఆడవారిని హత్య చేయడం ఏ- లిమిటేషన్ కిందకు వస్తుంది? హత్య, నేర సంస్కృతికి తెరలేపి దీనికి ఆధునికతను ఆపాదించడం బాధాకరం.

పైన పేర్కొన్న అంశాలకు మచ్చుతునకగా తెలంగాణలో జరిగిన కొన్ని సంఘ టనలను చెప్పుకుందాం. కొద్ది రోజుల కిం ద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రా యపోలు నాగమణి అనే కానిస్టేబుల్ ఎస్సీ కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో సొంత సోదరుడే ఆమెను హత్య చేశాడు. అలాగే, సూర్యాపేట జిల్లాలో మాల కులానికి చెందిన ఓ యువకుడు గౌడ కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో యు వతి తోబుట్టువులు ఆ యువకుడిని హత్య చేశారు.

పైగా అతడి చావును తమ నాయనమ్మకు బహుమానంగా ఇచ్చామని గొ ప్పలు చెప్పుకున్నారు. ఈ సంఘటన మరవక ముందే పెద్దపల్లి జిల్లాలో తన కూ తుర్ని ప్రేమించాడనే కారణంతో స్వయం గా యువతి తండ్రే యువకుడిని హత్య చేశాడు. ఒక ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాగరాజు అనే దళిత యువకుడిని యువతి సోదరులు హత్య చేశారు. ఇటువంటి సంఘటనలే కాకుండా భూములు, ఆస్తులు, ఇతర ఆర్థిక అవసరాలు, విలాసవంతమైన జీవితం వంటి పేర్లతో బంధాలను మరిచి ప్రాణాలను బలిగొనే విష సంస్కృతి రోజురోజుకీ పెరిగిపోతున్నది. 

మానవతా విలువలకు పెద్దపీట

ఈ హత్యా సంస్కృతికి అడ్డుకట్ట వేయటంలో, మానవతా విలువల భావజాలా న్ని విస్తృతంగా వ్యాప్తి చేయడంలో పాలకులు, పౌరసమాజం విఫలమవుతున్నది. పాలకులుగానీ పౌరసమాజం కానీ ఎం దుకు ఈ విషయంలో విఫలమవుతున్నారనే మౌలిక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ ప్రశ్నను ఎవరికి వారు సంధించుకోవాలి. అలాగే పాలకులతోపాటు పౌర సమాజం కూడా ప్రశ్నంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాజనీతి తత్వం ప్రకా రం మెజారిటీ అంటే ఎప్పటికీ మెజారిటీ యే. మైనార్టీ అభిప్రాయాన్ని, వారి భావాలను ఈ మెజార్టీ గౌరవించాల్సి ఉంటుం ది. దానికి విరుద్ధంగా మేము మెజార్టీ వర్గానికి చెందిన వాళ్లం అనే అహం ప్రదర్శించడం వల్ల ఆధిపత్యం అనే భావన పురుడు పోసుకుంది.

ఇది క్రమంగా బలంగా తయారైంది. ఈ భావన ప్రస్తుతం చాలామందిలో నరనరాన పాతుకుపోయింది. అందువల్లే కులం, మతం, పరువు వంటి పేర్లతో హత్యలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ కుల, మత హత్యలు, బహిష్కరణలు, వివక్షలు, దాడులు వంటి దారుణాలను ఆపడానికి పాలకులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇవి ఇలానే కొనసాగితే ప్రజల్లో ఎప్పటికీ అశాంతి నెలకొనాలో పాలకులే చెప్పాలి. ప్రభుత్వాలు ఈ దారుణాలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

లేదంటే ఈ నిందను తప్పనిసరిగా పాలకులు మోయాల్సిందే. చాలావర కు ఇటువంటి సంఘటనల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ, అధికార యంత్రాంగం భాగస్వామ్యం కనిపిస్తుంది. కోర్టులు, చట్టాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, పోలీసు యంత్రాంగంతోపాటు మేధావులు, శాస్త్రవేత్తలు ఇలా ‘ఎందరు ఉండి ఏం ప్రయోజనం?’ అనిపిస్తుంది సామాన్యులకు!

ఆధిపత్యం అనే విషం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. కొందరు పాలకులు ప్రజల భావోద్వేగాలను తమ రాజకీ యాలకు వాడుకుంటున్నారు. బుల్డోజర్లను విస్తృతంగా వినియోగించుకుంటూ తమ దారికి తెచ్చుకుంటున్నారు. కులం, మతం పేరుతో ప్రజల్లో అశాంతి, అల్లకల్లోలాన్ని సృష్టించి ఆధిపత్యాన్ని చెలాయిస్తు న్నారు. వాళ్ల ఆలోచనలను, భావజాలాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. ‘మీ పాలన కింద మేము ఉండదలుచుకోలేదని’ ప్రజ లు అనడం లేదంటే దానికి కారణం ప్రజ ల్లో ఇంకా ఈ వ్యవస్థ, రాజ్యాంగం, పౌర సమాజంపై నమ్మకం ఉండటమే అని అర్థం చేసుకోవాలి. కొన్ని రక్షణ చర్యలతో అయినా సంతృప్తి పడటం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతున్నది.  

దేశద్రోహంగా పరిగణించాలి

ఇప్పటికైనా పరువు హత్యలను నిరోధించడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టా లను తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని అంతే కఠినంగా అమలు చేయాలి. చట్టాలను రూపొందించి, వాటిని అమలు చేసే విధంగా పౌర సమాజం కొట్లాడాలి. హక్కు లు, బాధ్యతల కోసం మనం ఎంతవరకైనా పోరాడతాం. అదే స్థాయిలో కుల, మత వివక్షతను బహిష్కరించి, నేర సంస్కృతిని పాలద్రోలే ఆలోచనలను పౌరసమాజం చేయాలి. కుల, మత వివక్షత పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఒక రకంగా దేశద్రోహంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిలో ఆర్థికాంశాలతోపాటు సామాజిక విషయాలు కూడా మిళితమై ఉంటాయి.

ఓట్లతో అధికారం పంచుకోవడం కోసం పాలకులు పాకులాడుతారో అదే స్థాయిలో ప్రజలమధ్య స్నేహ పూరిత, సో దర భావం కోసం చర్యలు చేపట్టాలి. ఇం దుకోసం అన్ని రకాల శక్తియుక్తులు కూడగట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా శ్రమ విలువను గౌరవించే సంప్రదాయాన్ని, భా వజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి జేయాలి. ఇం దుకోసం పని చేస్తున్న ప్రజా సంఘాలు సమాజాంలో జరుగుతున్న దుర్మార్గాలను ఎప్పటి కప్పుడు తప్పనిసరిగా ఖండించాలి. కులం, మతం పేరుతో జరిగే అరాచ కాలను అడ్డుకునేందుకు ప్రజల్లో చైతన్యం తెస్తున్న వాళ్ల గొంతుకల్ని ఏకం చేయాలి.

పక్క వాళ్ల విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మనం దాన్ని అడ్డుకోకపో తే రేపటి రోజున మనకూ అదే అన్యాయం జరిగే రోజు రావచ్చు. అప్పుడు మనకో సం ఏ ఒక్కరూ అండగా నిలబడరనే విషయాన్ని ఇక్కడ ప్రజలు గుర్తించాలి. ఒకర్ని హత్య చేయడం అనేది ఏ రకంగా చూసినా నేరపూరితమైందే. సత్యాన్ని సత్యంగా నమ్ముకున్నప్పుడు కులమతాలకు అతీతం గా ప్రేమపెళ్లి సంస్కృతి అభివృద్ధి కావాలి. కుల, మత, వర్గ రహిత సమాజ అవతరణ అత్యావశ్యకం. ఆ దిశగా ప్రయాణాన్ని నేటితోనైనా ప్రారంభించాలి. ప్రజల్లో స్నేహ పూర్వక వాతావరణం పెంపొందాలంటే కులం, మతం, వర్గం వేరైనా మనుషులం తా ఒక్కటే అనే భావజాలం సమాజంలో పెంపొందాలి. ఈ అభివృద్ధి సాధ్యమైన రోజున కులమతాల వివక్షలకు అడ్డుకట్ట పడుతుంది. 

వ్యాసకర్త: పాపని నాగరాజు, సెల్: 9948872190