26-08-2025 01:39:32 PM
కామారెడ్డి (విజయక్రాంతి): హైదరాబాదు కూకట్ పల్లి కోర్టు పరిధిలో విధులలో భాగంగా కక్షిదారులతో పాటు న్యాయవాదైన తన్నీరు శ్రీకాంత్, కోర్ట్ బెలీఫ్ సివిల్ కేసులో కోర్ట్ వారంటును అమలు పరచడానికి వెళ్లడం జరిగింది. వృత్తిలో భాగంగా వారంట్ అమలు కొరకు వెళ్లిన న్యాయవాదిపై కొంతమంది అరాచకవాదులు దాడి చేశారు. ఈ సంఘటనను ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించాలని పిలుపును ఇవ్వడం జరిగింది. పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కోర్టులో కూడా విధులను న్యాయవాదులు బహిష్కరించారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్ మాట్లాడుతూ, ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ నిన్న న్యాయవాది అయినటువంటి శ్రీకాంత్ పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి వారిని శిక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం విచారకరమన్నారు. చట్టపరిధిలో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు ఎల్లప్పుడూ కక్షిదారులకు అండగా నిలుస్తూ న్యాయం కొరకు పోరాడుతున్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మురళి, సీనియర్ న్యాయవాదులు క్యాతం సిద్ధిరాములు, జగన్నాథం, శంకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గోవింద్ రావు, అమృతరావు, ముకేమ్, జడల రజనీకాంత్, శ్రీను, నారాయణ బత్తుల,వేణు తదితరులు పాల్గొన్నారు.