07-10-2025 04:23:59 PM
సుల్తానాబాద్ లో న్యాయవాదుల విధుల బహిష్కరణ..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దుశ్చర్యను నిరసిస్తూ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఇటీవలి కాలంలో న్యాయవాదులపై కూడా దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు ఆవుల లక్ష్మి రాజం, భూసారపు బాలకిషన్ ప్రసాద్, ఆలూరి శ్రీనివాసరావు, ఓడ్నాల రవీందర్, జోగుల రమేష్, ఆవుల శివ కృష్ణ, బొబ్బిలి శ్యామ్, యుగంధర్, స్నేహ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.