07-10-2025 05:08:38 PM
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి..
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి..
అక్రమ రవాణాపై అంత రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు..
సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ..
హుజూర్ నగర్: నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ నరసింహకు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు స్వాగతం పలికారు. ఎస్ఐ మోహన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరేడ్‌ను నిర్వహించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ... రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. రాష్ట్రంలోకి గంజాయి, మత్తు పదార్థాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నేరాలు అదుపునకు ప్రజలు భాగస్వామ్యం కావలసి ఉందని, అక్రమ రవాణా, గంజాయి రవాణా, మత్తు పదార్థాల విక్రయం, నేరాలను అదుపు చేయడానికి ప్రజలు సహకారం అందించాలన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. పట్టణాల్లో, పల్లెల్లో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే ఎటువంటి వ్యక్తులనైన, చర్యలనైన సహించేది లేదన్నారు. పోలీస్ భరోసా కార్యక్రమాలు చేపడుతూ సైబర్ క్రైమ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్ ప్రమాదాల అంశాలపై ప్రజలకు, విద్యార్ధులకు, యువతీ, యువకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సీఐ చరమందరాజు, ఎస్ఐలు బండి మోహన్, బాబు, నరేష్, రవీందర్ నాయక్, కోటేష్, ఎఎస్ఐ బలరాంరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.