calender_icon.png 24 December, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుష్టు రహిత సమాజమే ధ్యేయం...

24-12-2025 03:42:47 PM

డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వామన్ రావ్..

బోథ్,(విజయక్రాంతి): కుష్టు వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంతో ఆశా కార్యకర్తలచే ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ వామన్ రావు అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న సర్వేను బుధవారం బోథ్ మండలంలోని బోథ్, పొచ్చర గ్రామాలతో పాటు సోనాల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా వామన్ రావు మాట్లాడుతూ... శరీరంపై పాలిపోయిన, రాగి రంగుగల మొద్దు బారిన మచ్చలు, కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు ఎవరికైనా ఉన్నట్లయితే తమ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి చూపించుకోవాలని కోరారు. ఎండిటితో కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని, అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు.

ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి అంగవైకల్యం కలగదని పేర్కొన్నారు. 2027 సంవత్సరం వరకు భారతదేశాన్ని కుష్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఆశా కార్యకర్తలు సైతం సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.ఓ. రమేష్, ఆరోగ్య కార్యకర్తలు లింగారెడ్డి, గోవర్ధన్, జమున, స్నేహ, ఆశా కార్యకర్తలు అనసూయ, శారద, పుష్ప, కవిత,పులాబాయి పాల్గొన్నారు.