1 July, 2026 | 8:19 AM

బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం

13-06-2024 12:27 AM

జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక

గజ్వేల్, జూన్ 12: బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని గజ్వేల్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక అన్నారు. బుధవారం కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి ప్రియాంక పాల్గొని మాట్లాడుతూ.. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించేందుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 నుంచి ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

14ఏళ్ల లోపు పిల్లలు ఎక్కడా పనిచేయడానికి వీలులేదని, 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారిని ఎలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో పని చేయించకూడదని వివరించారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించేలా ప్రచురించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు హరికృష్ణ, నాగిరెడ్డి, సుదర్శన్, రామకృష్ణ, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యుడు దేశబోయిని నర్సింలు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది నర్సింహాచారి, యామిని తదితరులు పాల్గొన్నారు.