విద్యుత్ షాక్‌తో రైతు మృతి
మెదక్, జూన్ 12 (విజయక్రాంతి): విద్యు త్ షాక్‌కు గురై ఓ రైతు మృతిచెందిన ఘటన మెదక్ మండలం పేరూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వెలమకన్నె నగేశ్ (40) తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న స్తంభం సపోర్టు వైరును పట్టుకున్నాడు. ఆ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో నగేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్తంభానికి సపోర్టుగా ఉండే వైరుకు పూసలు ఏర్పాటు చేసి కరెంట్ సరఫరా కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నగేశ్ మృతిచెందినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపించారు. ట్రాన్స్‌కో అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. దీంతో ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌బాబు, ఏఈ తిరుపతిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబీకులను సముదాయించారు. విద్యుత్ శాఖ పరంగా రావాల్సి న బెనిఫిట్స్ అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు.






