హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదాం
మాజీ మంత్రి చంద్రశేఖర్
జహీరాబాద్, ఏప్రిల్ 5: హక్కుల కోసం ఐక్యంగా పోరాడి సాధించుకుందామని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని మునిసిపల్ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సమత వేదిక అధ్యక్షులు వరహాలు అధ్యక్షత వహించగా వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి మాట్లాడుతూ దళితులంతా ఐక్య పోరాటం చేసి మన హక్కులను సాధించుకుందామన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తు చేస్తూ మాదిగలను క్రిస్టియన్ గా ఉన్నవారికి ఎస్సీ హోదా తొలగిస్తున్నట్లు ఇచ్చిన తీర్పుని ఆయన తప్పు పట్టారు. ఈ తీర్పును దళితులంతా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
తనకు అవకాశం వస్తే పోలీస్ స్టేషన్ను ఇక్కడి నుంచి తొలగించి ఈ స్థలంలో బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. పోలీస్ స్టేషన్ ను మరో ప్రాంతానికి తరలించి సేవలు అందిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనిస్, వైస్ చైర్మన్ శిరీష రెడ్డి, కోహిర్ మున్సిపల్ చైర్మన్ అశోక్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు వై.నరోత్తం, నామ రవి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉగ్గేల్లి రాములన్న, ఖాజా, జనార్ధన్, శ్రీనివాస్ టీచర్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.




