calender_icon.png 13 September, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణదాతలమవుదామా!

13-08-2024 12:00:00 AM

నేడు  ప్రపంచ అవయవదాన దినోత్సవం

‘అందరూ అవయవ దానానికి ముందుకు వస్తే మానవులు మరణాన్ని జయించినటే’్ల అన్నారు శ్రీశ్రీ. ఈ మాటలు వాస్తవరూపం దాలిస్తే ఏటా భారతదేశంలో 5 లక్షల అవయవాల లోపాలతో మరణించే వారిని సజీవంగా నిలుపగలం. దేశంలో మూత్రపిండాలు, కాలేయాలు పాడైనవారు 2 లక్షల 20 వేలు, గుండె సమస్యలతో 50 వేలు, ఊపిరితిత్తుల సమస్యలతో 20 వేలు, కళ్ళు ఇతర అవయవాలు సక్రమంగా పనిచేయక 5 లక్షల మంది ప్రతీ సంవత్సరం అకాల మరణం పొందుతుండటం బాధాకరం. అవయవాల దానాలు చేయడానికి వీలు కల్పిస్తూ 1994లో, మరికొన్ని మార్పులతో 2011లో ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. 

1954లో తన సోదరుడికి మూత్రపిండం ఇవ్వడం ద్వారా రోనాల్ లీ హెరిక్ ప్రపంచంలో తొలి అవయవ దాతగా చరిత్ర పుటల్లో నిలిచాడు. 79 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు జీవించి ఇటీవలే మరణించాడు. ఈయనకు ఆపరేషన్ చేసిన వైద్యుడు జోసెఫ్ ముర్రే 1990లో నోబెల్ బహుమతి అందుకున్నారు. 107 సంవత్సరాల వయస్సులో కార్నియా దానం ద్వారా ఆదర్శంగా నిలిచిన స్కాట్లాండ్ మహి ళ ఎల్లప్పుడూ చరిత్రలో నిలిచిపోతుంది. అర్జెంటీనాలో 18 సంవత్సరాలు నిండినవారు అవయవదానం చేయవచ్చని చట్టం చేశారు. ఎక్కువగా స్పెయి న్, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాల్లో అవయవ దానం చేసేవారున్నారు.  ప్రతీ 10 లక్షల మందిలో 46.91 శాతంతో స్పెయిన్ మొదటి స్థానంలో ఉంది.

భారత్‌లో అవయవ దానం చేసేవారు ప్రతీ 10 లక్షల మందిలో కేవ లం 0.86 శాతమే ఉన్నారు. దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో, తెలంగాణ తదుపరి స్థానంలో నిలిచాయి. ఒక వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా 8 మందిని బతికించగలడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్రెయిన్‌డెడ్ అయిన వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు సమకూరుతాయి. ఏటా మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో లక్షన్నర మంది మరణిస్తున్నారు.

ఇటువంటి వారినుండి కూడా కుటుంబసభ్యుల అనుమతితో అవయవాలు సేకరించేందుకు చర్యలు చేపట్టాలి. అవయవ దానం రెండు రకాలు. మొదటిది ‘లైవ్ డొనేషన్’. బతికి ఉండగా తన కిడ్నీ, లివర్ భాగం వంటివి వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వడం. రెండవది --‘కేడెవెర్ డొనేషన్’. బ్రెయిన్ డెడ్ కేసుల్లో కుటుంబసభ్యులు అంగీకారంతో తీసుకొనేవి. అవయవ దానాలన్నీ చట్ట ప్రకారంగా, వ్యక్తులు, కుటుంబసభ్యుల అంగీకారంతోనే జరగాలి. అక్రమార్కులపట్ల జాగ్రత్తగా ఉండాలి.

 ఐ.ప్రసాదరావు