13-08-2024 12:00:00 AM
గతేడాది జనవరిలో అదానీ గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ సంస్థ ఏడాదిన్నర తర్వాత మళ్లీ అదే గ్రూపు లక్ష్యం గా మరో బాంబు పేల్చింది. అదికూడా గతంలో అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సంస్థ చైర్‌పర్సన్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలతో రెండు రోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. అది ఇప్పుడు ట్రేడ్ వర్గాలోపాటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారాన్ని రేపుతున్నది. ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అన్న ట్వీట్‌తో మూడు రోజుల క్రితం ఇన్వెస్టర్లలో గుబులు రేపిన హిండెన్‌బర్గ్ మర్నాడే సంచలన ప్రకటన చేసింది. గతేడాది అదానీ గ్రూపుపై సంచలన ప్రకటన చేసి ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమవడానికి కారణమైన ఆ సంస్థ ఇప్పుడు ఏకంగా సెబీ చైర్‌పర్సన్ మాధబిపురి బచ్‌తోపాటు ఆమె భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది.
అదానీ గ్రూపు స్టాక్స్‌ను కృత్రిమంగా పెంచేందుకు ఉప యోగించిన మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో మాధబి, ఆమె భర్త ధవల్ బచ్‌లకు వాటాలున్నాయంటూ తాజా నివేదికలో వెల్లడించింది. అదానీ సోదరుడు వినోద్ అదానీ పెట్టుబడులు పెట్టిన సంస్థలో మాధబి పురి, ఆమె భర్త ధవల్ పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. సెబీలో సభ్యురాలుగా మాధబి చేరడానికి కొద్దిరోజుల ముందు (2017 మార్చి 12న) ఆమె భర్త మారిషస్ సంస్థను సంప్రదించినట్లు హిండెన్‌బర్గ్ తాజాగా ఆరోపించింది. తన భార్య పేరుమీద ఉన్న ఆస్తులను బదలాయించి వాటికి తానే అథరైజ్డ్ పర్సన్‌గా ఉంటానని ధవల్ ట్రైడెంట్ ట్రస్ట్ అనే మారిషస్ సంస్థ అడ్మినిస్ట్రేటర్‌కు చెప్పారన్న విషయాన్ని హిండెన్‌బర్గ్ తెరపైకి తెచ్చింది.
మారిషస్ సంస్థలో ధవల్ పెట్టుబడుల నికర విలువ 10 మిలియన్ డాల ర్లు అంటే 88 కోట్ల రూపాయలని హిండెన్‌బర్గ్ చెప్తున్నది. అదానీ గ్రూపు పై సెబీ సరిగా విచారణ చేయకపోవడానికీ ఇదే కారణమని ఆ సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అవన్నీ నిరాధారనమైనవని మాధబి పురి, ఆమె భర్త ధవల్ తోసిపుచ్చారు. తమ జీవితం తెరిచిన పుస్తకమని, ఆర్థిక వివరాలన్నీ ఎప్పటి కప్పుడు సెబీకి ఇస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు, 2017లో మాధబి సెబీ సభ్యురాలుగా నియామకమైన వెంటనే ఆమెకు చెందిన రెండు కన్సల్టింగ్ సంస్థలను మూసి వేసినట్లు వారు ప్రకటించారు. మరోవైపు హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశాలతో తమకు సంబంధం లేదని గౌతమ్ అదానీ నేత్వత్వంలోని అదానీ గ్రూప్ తెలిపింది. సెబీ గ్రూప్ చీఫ్‌తోను, ఆమె భర్తతోను తమకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టంచేసింది.
అయితే, తాము చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్ మాధబి బచ్ చేసిన ప్రకటన మరిన్ని చిక్కు ప్రశ్నలను లేవనెత్తుతున్నదంటూ తాజాగా హిండెన్‌బర్గ్ మరోసారి సామాజిక మాధ్యమంలో వరస ట్వీట్లు చేసింది. మాధబి స్పం దనలో ఆమెకు బెర్ముడా/ మారిషస్ ఫండ్స్ ఉన్నాయన్న విషయం నిర్ధారణ అయిందని పేర్కొంది. సెబీలో నియామకం తర్వాత ఆమె స్థాపించిన రెండు సంస్థలు నిద్రాణమైనాయని, 2019లో వాటి బాధ్యతలను ఆమె భర్త స్వీకరించారని పేర్కొంది. ఆ ఫండ్స్‌ను ధవల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్నాడని, ప్రస్తుతం అతను అదానీ గ్రూపులో డైరెక్టర్‌గా ఉన్నారని పేర్కొంది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందికే వస్తుందని స్పష్టం చేసింది.
అప్పటికే ఈ అంశంపై ప్రతిపక్షాల్లో రాజకీయ కాక మొదలైంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ పార్టీసహా ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోసారి ఈ ఆరోపణలపై విచారణ జరుపుతుందా? అని గతంలో ఈ అంశాన్ని పార్లమెం టులో ప్రధానంగా ప్రస్తావించిన రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ గట్టిగానే తిప్పికొడుతున్నది కానీ ప్రతిపక్షాల హోరు ముందు అంత గట్టిగా వినిపించడం లేదు. ఈ వ్యవహారం మరోసారి ఎలాంటి రాజకీయ దుమారానికి దారితీస్తుందో, స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీ షేర్లపై ఎలాంటి ప్రభావం చూసిస్తుందో చూడాలి.