26-10-2025 01:00:39 AM
‘గీతా సుబ్రమణ్యం’ ఫేమ్ మనోజ్ కృష్ణ తన్నీరు హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏ కప్ ఆఫ్ టీ’. నేటి యువతకు నచ్చే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజర్స్, నిఖిత రావు దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేషన్స్ పతాకంపై మనోజ్ కృష్ణ, నవీన్ కృష్ణ నిర్మించారు. జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాకేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘వాట్ హ్యాపెండ్’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో హీరో మనోజ్ మాట్లాడుతూ.. “మా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి మేము ఎంచుకున్న మార్గమే ఈ ప్రమోషనల్ సాంగ్. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయనేది ఈ పాటలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాం.
ఈ సినిమా ఒక యంగ్‌స్టర్ జర్నీ. ఒక కాలేజ్ యువత జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది.. అది ఎలా డీవియేట్ అవుతుంది.. దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అన్నది ఈ సినిమాలో చూపించాం. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ నేటి యువతకు తప్పకుండా నచ్చుతుంది” అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రవిజ్, సినిమాటోగ్రాఫర్ కమల్ నాబ్, నటుడు రాకేశ్, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.