పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ, ఆగస్టు 17: మరో రైలు పట్టాలు తప్పింది. వారణాసి నుంచి సబర్మతి వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని భీమ్‌నేన్ వద్ద శనివారం తెల్లవారుఝామున ప్రమాదానికి గురైంది. రైలులోని 22 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణీకులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని ఉత్తరమధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి శశికాంత్ త్రిపాఠీ తెలిపారు. నిద్రలో ఉండగా పెద్దశబ్దం రావటంతో కాసేపు భయంతో గందరగోళానికి గురైనట్టు ప్రయాణీకులు తెలిపారు. విషయం తెలుసుకొన్న వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారని త్రిపాఠీ చెప్పారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం లేకపోలేదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘కాన్పూర్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ రాత్రి 2.35 గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న ఓ భారీ వస్తువును ఢీకొని పట్టాలు తప్పింది. ఇంజిన్‌పై అందుకు సబంధించిన గీతలు కూడా ఉన్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో, యూపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.




