10-08-2025 01:06:09 AM
వచ్చేనెల నుంచి ప్రతి శుక్రవారం అరుణాచల యాత్ర
టీటీడీలో శీఘ్రదర్శనానికి అవకాశం ఇవ్వాలి
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ టూరిజం విజ్ఞప్తులు
హైదరాబాద్, ఆగస్టు ౯ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పర్యాటకులకు, సందర్శకులకు, భక్తులకు వివిధ రకాల టూరిజం ప్యాకేజీలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో గతంలో కంటే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ టూరిజం శాఖ కూడా ఆ మేరకు ప్యాకేజీలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ టూరిజం ప్రస్తుతం ఆరుణాచలం దేవాలయ దర్శన ప్యాకేజీని రూపొందించింది. సెప్టెంబర్ మొదటివారంలో ప్రతి శుక్రవారం అరుణాచలం ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ యాత్ర నాలుగురోజుల పాటు ఉంటుంది. యాత్రలో కాణిపాకం, అరుణాచలం, వెల్లోర్ గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. భక్తులకు రవాణా, వసతి సదుపాయాలు కల్పిస్తారు. భోజన ఖర్చులు, దర్శనాలు వంటివి భక్తులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఏసీ కోచ్‌లల్లో యాత్ర ఉంటుందని, పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6,400లలో యాత్ర ప్యాకేజీ ఉందన్నారు. ఇక గతంలో అరుణాచలం ఆధ్యాత్మిక యాత్ర పౌర్ణమి రోజున అక్కడికి చేరుకునే విధంగా బస్సులను ఏర్పాటు చేసేవారు. నెలకోసారి మాత్రమే ఉండేది.
ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ప్రతి శుక్రవారం ఈ యాత్ర మొదలవుతుందని, ఆయల దర్శనాలు, అరుణాచలంలో గిరి ప్రదక్షణలు ఉంటాయన్నారు. సోమవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకునే విధంగా ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు టూరిజం శాఖ సెంట్రల్ రిజర్వేషన్, సమాచారా కార్యాలయాల్లో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
త్వరలో మారేడ్‌మిల్లి ప్యాకేజీ
ఇటీవల బాగా ప్రాముఖ్యత సంతరించుకున్న మారేడ్‌మిల్లి భద్రాచలం టూరిజం ప్యాకేజీని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికుల్లో, భక్తుల్లో ఆలయ దర్శనయాత్రలు చేయాలన్న ఆసక్తి పెరిగినందున ఆ మేరకు ప్యాకేజీలు రూపొందించారు. దీన్ని పరిశీలిస్తే బాసర యాత్ర ప్రతి శనివారం ఉంటుంది. తెలంగాణ ఆలయ టూర్‌లో భాగంగా ఓ ప్యాకేజీని రూపొందించారు.
ఈ యాత్రలో యాదగిరిగుట్ట, భద్ర కాళి ఆలయం, వెయ్యి స్థంభాల గుడి, రామ ప్ప, కాళేశ్వరం, కోటిలింగాల, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, వర్గల్ విద్యా సరస్వతీదేవి ఆలయాలు దర్శించుకోవచ్చు. అంతరాష్ట్ర ప్యాకేజ్ టూర్లలో తిరుపతి శ్రీశైలంలు ఉన్నాయి. షిర్డీ టూర్ ప్రతిరోజు ఉంటుంది. షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, షిర్డీ ఆధ్యాత్మిక యాత్రలున్నాయి. రాయలసీమ ఆలయ ప్యాకేజీలో ప్రతి శుక్రవారం ఉంటుంది. దీనిలో అహోబిలం, మహానంది, బేలూమ్ గుహాలు, యాగంటి దేవాలయాలున్నాయి.
తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్స్
రాష్ట్రంలో జరిగే ప్రతిష్మాత్మక బోనాలు, బతుకమ్మ, మేడారం, నాగోబా, దసరా, సంక్రాంతి పర్వదినాలకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతీ, ప్రచారం తీసుకు వచ్చేందుకు తెలంగాణ టూరిజం ప్రణాళికలు రచిస్తోంది. టూరిజం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు, కార్నివాల్స్ నిర్వహించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో టూరిజం అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు.
అలాగే ఆదాయ పెంపుపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్నివాల్స్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజల డిమాండ్‌లను పరిగణలోకి తీసుకొని ప్యాకేజీలను అందుబాటులో తీసుకువచ్చేందుకు తెలంగాణ టూరిజం సమాయత్తం అవుతోంది.
తిరుమలలో శీఘ్రదర్శనానికి ప్రయత్నాలు
గతంలో తిరుపతితిరుమల టూర్ ప్యాకేజీలో శీఘ్రదర్శనం టికెట్ విధానాన్ని తెలంగాణ టూరిజం శాఖ నిర్వహించేది. శీఘ్రదర్శనానికి ప్రతిరోజు 350 టికెట్లు వరకు అందుబాటులో ఉండేవి. దీంతో తిరుమలకు తెలంగాణ టూరిజం నిర్వహించే యాత్రకు అద్భుతమైన స్పందన భక్తుల నుంచి వచ్చేదని, వారంతంలో అప్పుడున్న డిమాండ్‌తో బస్సులను ఏర్పాటు చేసేవారమని అధికారులు తెలిపారు.
కానీ గతేడాది నవంబర్ నుంచి ఈ శీఘ్రదర్శన టికెట్ విధానాన్ని టీటీడీ రద్దు చేసిందని అధికారులు తెలిపారు. అయితే భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగా తమ శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి అనేక సార్లు విజ్ఞప్తులు చేశామని, సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం, టీటీడీ నుంచి సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.