calender_icon.png 3 September, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిలపక్షంతో సీఎంను కలుద్దాం

01-09-2025 12:08:26 AM

* లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే పిటిషన్ ను వాపస్ తీసుకోవాలని కోరుదాం

* రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన నాయకుల నిర్ణయం

హుస్నాబాద్, ఆగస్టు 31 : ఎస్టీ జాబితా నుంచి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను వ్యతిరేకిస్తూ గిరిజన నాయకులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తెల్లం వెంకట్రావు, సోయం బాపురావుల వైఖరిని ఖండిస్తూ ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బంజారా భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

లంబాడీలపై పిటిషన్ దా ఖలు చేసిన సోయం బాపూరావు, తెల్లం వెంకటరావులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరాలని నిర్ణయించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు మంత్రి పొన్నం ప్ర భాకర్ మద్దతు కోరాలని తీర్మానించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్ రావు వంటి రాష్ట్ర స్థాయి నాయకులను కలిసి వారి మద్దతు కూడా కోరాలని నిర్ణయించుకున్నారు.

ఈ సమస్యను న్యాయపరంగా ఎదుర్కోవాలని కూడా తీర్మానించారు. సీనియర్ న్యాయవాదులను సంప్రదించి, కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే, హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రగా వెళ్లి తమ నిరసనను తెలియజేస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాలోత్ బీలు నాయక్, లావుడ్య కిషన్ నాయక్, సరోజన, శారద, భూక్య వీరన్న నాయక్, మాలోతు రామచంద్రనాయక్, కృష్ణా నాయక్ సహా పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపడతామని వారు స్పష్టం చేశారు.