03-09-2025 05:18:35 PM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బీసీ రిజర్వేషన్ బిల్లును అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలిపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వందల కోట్లు దోచుకుని పదేళ్లు బీసీలను గత పాలకులు మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ లు పెంచకుండా రాజకీయ పార్టీలు, అగ్రకుల పెద్దలు కుట్రలు చేస్తున్నారని, బీసీలు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు కాకూడదా అని అగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సి, ఎస్టీ లకు అగ్రకూలాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ తో న్యాయం జరుగుతోంది. కానీ 60 శాతం జనాభా కలిగి ఉన్న బీసీలకు 42 శాతం ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు సమస్య ఏంటని ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే లు గల్లీలో మద్దతు ఇస్తూ, ఢిల్లీలో అడ్డుకుంటున్నారని,బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికెట్ గా మారాయన్నారు.నిజంగా మోడీ బీసీ అయితే, పార్లమెంట్ లో బీసీ బిల్లు ఎందుకు పెట్టట్లేదు అని ప్రశ్నించారు. బీసీ లకు, బీసీ మహిళలకు మోడీ చేసింది ఏమిటో చెప్పాలన్నారు. మాజీ సీఎం చేసిన రిజర్వేషన్ల గుది బండను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సవరించింది. కానీ బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి రాగానే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. 42 శాతం ఆమోదం తెలపని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం బీసీలకు రాజకీయ పార్టీ వస్తుందినీ మా ఓట్లు మేము వేసుకొని ఇతర పార్టీలను బొంద పెడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, శోభారాణి, దాడి మల్లయ్య యాదవ్, సంఘాన్ని మల్లేశ్వర్, వరంగల్ శ్రీనివాస్, చందా మల్లయ్య, బీసీ సంఘం మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.