03-09-2025 05:39:09 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీకి ప్రభుత్వం రెగ్యులర్ కమిషనర్ ను నియమించలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణికి కేసముద్రం మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్చార్జి కమిషనర్ ప్రసన్న రాణి వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లడానికి సెలవు కోరడంతో, ప్రభుత్వం ఆమెకు 38 రోజులపాటు సెలవు మంజూరు చేసింది.
దీనితో మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ కు కేసముద్రం మున్సిపల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాజేశ్వర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కొత్త మున్సిపాలిటీ.. ఇప్పటికే ఇన్చార్జి కమిషనర్, తాజాగా ఇన్చార్జి కమిషనర్ స్థానంలో మరో ఇన్చార్జి కమిషనర్ నియామకంతో కేసముద్రం పురపాలన ఇన్చార్జిలతోనే ప్రారంభమై, ఇన్చార్జీలతోనే సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.