calender_icon.png 19 August, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసించే స్థితికి ఎదుగుదాం!

05-01-2025 12:00:00 AM

దాదాపు దేశ జనాభాలో 50 శాతం పైగా వున్న బీసీలు కొన్ని దశాబ్దాలుగా కొంద రు నాయకుల స్వార్థపూరిత ఓటు బ్యాంకు రాజకీయాలతో విద్యా, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడి వున్నారు. ప్రజాస్వామ్య, లౌకిక భారతంలో సమాన అవకాశాలు పొందలేక పోతున్నారని గణాంకాలతోసహా మేధావులు, ప్రజాప్రతినిధులు విశ్లేషిస్తు న్నారు.

చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అవసరమని, ‘హక్కుల కోసమే మా పోరాటం’ అంటూ వారు పోరాటం ఉధృతమైంది. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970లో అనంత రామన్ కమిషన్ నివేదిక, 1982లో మురళీధరరావు ఏకసభ్య కమిషన్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీయస్ రాములు నేతృత్వంలోని తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ వంటివి విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలు చాలా వెనుకబడి వున్నారని వివరించాయి. నేడు దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయినుంచే వారి రాజకీయ చైతన్యం కొత్త మలుపులు తిరుగుతోంది.

ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో, అసెంబ్లీలు, లోక్‌సభల్లో వారి గొంతుకలు పెద్ద ఎత్తున వినిపించడం లేదు. ‘మనమంతా కలిసి దేశంలో సగం భాగమై వున్నా కూడా మన పాలన ఏమయ్యింది?’ అన్న కోణంలో కారణాలు వెతుకుతున్నారు. ఇన్నాళ్ళు కేవలం పనివాళ్ళుగానే వుంటూ పాలించేవారిగా ఎదగలేక పోయామని, కనీసం మన పిల్లల భవిష్యత్తులనైనా మార్చుకుందామని వారు భావిస్తున్నారు.

భవిష్యత్తుకు పునాది ఐక్యతే 

గత కొన్ని దశాబ్దాల పరిణామ క్రమాన్ని గమనిస్తే కొంతమంది నాయకులే తమ స్వార్థపూరిత రాజకీయ పదవుల కోసం అగ్రకులాల రాజకీయ నాయకుల వద్ద బీసీ జెండా వాడుకున్నారని, కుల సంఘాలను త్యాగం చేశారని తెలుస్తుంది. బీసీ కుల సంఘాల్లో కూడా కొన్ని కులాలకు చెందిన కొందరు నాయకుల ఆధిపత్య ధోరణీ నేటి బీసీల అనైక్యత, వర్గపోరుకు కారణమని మేధావులు, విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ స్థాయి అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

కనీసం ఇక నుంచైనా ఎన్ని జెండాలు మన మధ్య వున్నా బీసీల ఎజెండా రాజ్యాధికారం కావాలని దృఢమైన భావనను వచ్చారు. ప్రస్తుత తరుణంలో బీసీల కులసంఘాల నాయకులు వారి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయానికి రావాలి. దీనికై బీసీ మేధావుల ఫోరాలు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు తదితర ప్రముఖులు అధిక సంఖ్యలో ముందుకు రావాలి.

రాజకీ యంగా, ఆర్థికంగా, సామాజికంగా వున్న బీసీ పెద్దలు తమందరి అభ్యున్నతికై తోడ్పాటు అందించాలి. బీసీ యువత చర్చలు, సమావేశాల్లో వారికి మద్దతు ఇవ్వా లి. అహింసా మార్గంలో శాంతియుత ఉద్యమాలు నడపుతూ బీసీల హక్కుల సాధనకై అలుపెరగని పోరాటాలు జరగాలి. 

మేమెంతో మాకంత’ కావాలి!

అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ప్రోత్సహిస్తూనే శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా వారంతా ఏకం కావాలి. ఓటు రూపంలో ఒక్కటై ‘మేమెంతో మాకంత’ అంటూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మన దేశ భవిష్యత్తును మార్చాలి. గతాన్ని వదిలేసి మౌనంగా ఐక్యమయ్యే పనులు చేస్తూ పోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు తమ శక్తిని ఓటు రూపంలో ప్రతిధ్వనింపజేయాలి.

ఇదంతా అనుకున్నట్టుగా సాగితే, బీసీల ప్రధాన ప్రాతినిధ్యాన్ని అన్ని రంగాల్లో త్వరలోనే మన దేశం చవిచూస్తుంది. ప్రస్తుతం ఎస్‌సీ, ఎస్‌టీ వారి రాజకీయ, సామాజిక చైతన్యం, సంఘటిత విధానాలను బీసీలు ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. జనాభా ప్రాతిపదికన అన్ని రంగా ల్లో అందరికీ సమాన అవకాశాల కోసం అడుగులు వేయాల్సిందే.

ప్రస్తుత పరిస్థితిలో బీసీలంటే కేవలం కొన్ని కులాల సమూహాలు కావు. దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో సమాన అవ కాశాలు పొందలేక వివక్షకు గురైన స్వాతంత్య్ర భారతంలోని మెజారిటీ ప్రజల వర్గం అని అందరూ అర్థం చేసుకోవాలి.

 ఫిజిక్స్ అరుణ్‌కుమార్