calender_icon.png 18 August, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరం నలువైపులా మెట్రోరైలు

05-01-2025 12:00:00 AM

హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన మెట్రో రైలు నగరం నలువైపులా విస్తరించి అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిత్యం రద్దీగా ఉండే విశ్వనగరం లో ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండోదశలో మెట్రోను నగరంలో అన్ని వైపులా విస్తరించాలని నిర్ణ యించడంపై  నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే నగరం నడిబొడ్డున పరుగెడుతున్న మెట్రో ఇకపై  శివారు ప్రాం తాల మీదుగా కూడా సాగనుంది. మెట్రో రైలు విస్తరణతో రవాణా సదుపాయాలు మరింత మెరుగవడమే కాకుండా ఆయా ప్రాంతాలు అన్ని విధాలుగా  అభివృద్ధి పథంలో పయనించే అవకాశాలు ఉండడంతో సిటీ అంతటా ‘మాకూ మెట్రో కావాలి’ అనే డిమాండ్ ఊపందుకుంది.

2025 నూతన సంవత్సర కానుకగా నగరవాసుల కోరికకు అనుగుణంగా రెండో దశ మెట్రో రైలు పనులను శివారు ప్రాంతాలైన మేడ్చల్, శామీర్‌పేట వరకు  విస్తరించాలని ప్రభు త్వం నిర్ణయించింది.

 దాదాపు పదేళ్లు ఆలస్యం  

నగరంలో ఎమ్‌ఎమ్‌టీఎస్, ఆర్టీసీ సంస్థలతో ప్రజా రవాణా అవసరాలు తీరడంలే దని గుర్తించి నగరంలో మెట్రో రైలు ప్రాజె క్టు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను 2003లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వివిధ కారణాలతో తీవ్ర ఆలస్యం అనంతరం 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు పనులకు భూమి పూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్ట్టింది.

దాదా పు రూ.22 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మొదటి దశలో రెడ్‌లైన్‌గా పిలవబడే లైన్-1 మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు, గ్రీన్‌లైన్‌గా పిలవబడే లైన్-2 జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు, బ్లూలైన్‌గా పిలవబడే లైన్-3 నాగోల్ నుండి రాయదుర్గం వరకు మూడు మార్గాల్లో 57 స్టేషన్ల మీదుగా మొత్తం 69.2 కి.మీల మేర మె ట్రో రైళ్లు నడుస్తున్నాయి. రోజూ 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. గ్రీన్ లైన్-2లో జేబీఎస్‌నుండి ఫలక్‌నుమా వర కు చేపట్టాల్సిన పనులు ఎంజీబీఎస్ వరకే పూర్తికా వడంతో, ఇందులో మిగిలిన పనులను రెండో దశలో కలిపారు.

ఎయిర్‌పోర్టు మార్గంలో మార్పులు

మొదటి దశలో చేపట్టిన పనులు నగరంలోని కొన్ని  ప్రాంతాలకే పరిమితం కావ డంతో  ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో మెట్రో రైలు విస్తరణకు ఇతర ప్రాంతాలతో పాటు నగర శివార్ల నుండి కూడా డిమాండ్ పెరిగింది. గత ప్రభుత్వం రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఓఆర్‌ఆర్ మీదు గా మెట్రో రైలు నడిపించేలా ‘ఎయిర్ పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్’ను ప్రతిపాదించగా, కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక ఈ మార్గంలో మార్పులు చేర్పులు చేసింది.

ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల మీదుగా కాకుం డా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల మీదుగా మెట్రో రైలు నడిపిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ప్రతిపాదనతో రేవంత్ రెడ్డి సర్కార్ ఎల్బీనగర్, చాం ద్రాయణగుట్ట, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలని కొత్త ప్రతిపాదనలు తెచ్చింది.

ఈ నూతన మార్గంతో పేద, మధ్య తరగతి ప్రజలకు కూడా మెట్రో అందుబాటులో ఉండడమే కాకుండా, ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు దూరం కూడా తగ్గడంతో ఈ నూతన ప్రతిపాదనలపై సర్వత్రా సానుకూలం వ్యక్తం అయ్యింది. మార్చిన ఈ అలైన్‌మెంట్‌లో ఎల్బీనగర్ నుండి చాంద్రాయణగుట్ట వరకున్న లైను కు పాతబస్తీ నుండి వచ్చే మెట్రో మార్గం కూడా కలవనుంది.

దీంతో ఆ జంక్షన్ నుం డి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేలా ఉన్న ఈ నూతన మార్గం పలు బస్తీల్లో, కాలనీల్లో నివసించే సాధారణ ప్రజలకు ఉపయోగకరంగానే కాకుండా, వెనుకబడిన ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడ్డాయి.

అంతే కాకుండా ఎయిర్‌పోర్టుకు మొదట ప్రతిపాదించినట్టు  మైండ్‌స్పేస్ మీదుగా మెట్రో రైల్ లైన్ నిర్మిస్తే దాదాపు 31 కి.మీలు ఉంటుంది. అదే చాంద్రాయణగుట్ట మీదు గా అయితే 5 కి.మీల మేర దూరం తగ్గుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పు లు అన్నిరకాలుగా ప్రయోజనకరంగా ఉండడంతో అన్ని వర్గాల వారు ఆహ్వానిస్తున్నారు.

నెరవేరనున్న పాతబస్తీవాసుల కల

నగరం దక్షిణ భాగంలో ఉండే సున్నితమైన పాతబస్తీ మీదుగా మెట్రో రైలుకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి దశలోనే పూర్తి కావాల్సిన పాతబస్తీ మెట్రో రైలు పలు కారణాలతో మరుగున పడింది. జేబీఎస్ నుండి ఫలక్‌నుమా వరకు పనులు చేపట్టాల్సి ఉన్నా పలు రాజకీయ ఒత్తిడిల కారణంగా అప్పుడు ఎంజీబీఎస్‌వరకే మెట్రోను పరిమితం చేశారు.

మెట్రో  రైలు ను ఫలక్‌ను మా వరకు పొడిగించాలని పాతబస్తీలో ఒకటి రెండు పార్టీలు మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పదేళ్ల అనంతరం ప్రభుత్వం మారడంతో పాతబస్తీ ప్రజల్లో మెట్రోపై ఆశలు మళ్లీ చిగురించాయి.

వారు కోరుకున్నట్టే రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు నిర్మాణంలో పాతబస్తీకి అధిక ప్రాధాన్యతివ్వడంతో స్థానికులు సంబురాలు కూడా చేసుకున్నా, గత అనుభవాలతో పనులు ప్రారంభించే వరకూ నమ్మలేమనే ఆందోళన వారిలో నెలకొంది. వీరి అపనమ్మకా న్ని పటాపంచలు చేస్తూ రెండో దశ పనులను పాతబస్తీ కేంద్రకంగానే జనవరిలోనే పనులు ప్రారంభించేలా ప్రభు త్వం వేగం గా అడుగులేస్తోంది.

అక్కడ ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించిన ప్రభుత్వం చెక్కుల పంపిణీకి కూడా సిద్ధమయ్యింది. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుం డా, మతకట్టడాలకు నష్టం జరగకుండా నూతన టెక్నాలజీతో డిజైన్లు రూపొందించి పనులను ప్రారంభించబోతున్నారు.రెండో దశలో పాతబస్తీతో పాటు ఇతర మార్గ్గాల్లో 2 భాగాలుగా చేపట్టే మెట్రో రైలు పనులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టే ఈ పనుల అనుమతి కోసం రాష్ట్ర ప్రభు త్వం డీపీఆర్‌లను కేంద్రానికి పంపింది. మొదటి భాగంలో నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు, రాయదుర్గం -కోకా పేట, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట, మి యాపూర్- పటాన్‌చెరు, ఎల్బీనగర్- హయత్‌నగర్ మొత్తం 76.4 కి.మీలు ఉండగా, రెండో భాగంలో శంషాబాద్ విమానాశ్రయం -ఫోర్త్ సిటీ వరకు 40 కి.మీల మార్గముంది.

నాలుగేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్న రూ.24,269 కోట్ల వ్యయం గల ఈ ప్రాజెక్టులో రాష్ట్రం వాటా 30శాతం రూ.7313 కోట్లు కాగా, కేంద్రం వాటా 18శాతం రూ.4230 కోట్లు. ప్రయివేట్ సంస్థల నుండి 48శాతం రూ.11693 కోట్లు, పీపీపీలో 4శాతం రూ.1033 కోట్లు సేకరించాలని తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది.

శివారు ప్రాంతాలకూ..

నగరంలో మెట్రో రైలును గతంలో వలే కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు ప్రధానంగా శివార్ల ప్రజలకు కూడా సమన్యాయం జరిగేలా ఉండా లని తలచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం కానుకగా నగరం ఉత్తర భాగంలో మెట్రో రైలును మరింత విస్తరించాలని నిర్ణయించారు.

ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు 23 కి.మీలు, జేబీఎస్ నుండి శామీర్‌పేట్ వరకు 22 కి.మీలు మొత్తం 45 కి.మీల పనులు రెండో దశలోనే చేపట్టేలా తక్షణమే డీపీఆర్‌లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీంతో నగరంలోని ఉత్తరం వైపు ప్రాంతం మొత్తంలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి.

కోటి మందికి పైగా జనాభాతో కిక్కిరిసిపోతున్న మహానగరం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో మెట్రో రైలును నగ రం నలువైపులా విస్తరించాలనే ప్రతిపాదనలకే పరిమితం కాకుండా ఆచరణలో తగు చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.

ప్రభుత్వం నిర్దేశించుకున్న సమయం లోగా అన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కార్‌కు సహకరించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.