calender_icon.png 19 August, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకల చేతనాచక్షువుల ప్రత్యక్ష తేజోరూపుడు

05-01-2025 12:00:00 AM

పాలకుండలు (ఏట్ర కలంగళ్) నిండి పైకి పొంగి పొరలి పోయే (ఎదిర్ పొంగి మీదళిప్ప) విధంగా ఎడతెగకుండా పాలు స్రవిస్తున్న (పాల్ శోరియుమ్) ఉదారమైన (వళ్లన్) భారీ ఆవులను (పెరుంబశుక్కళ్) విశేషంగా కలిగిన నందగోప కుమారా కృష్ణా (ఆట్ర పడైత్తాన్ మగనే) మేలుకో (అఱిఉఱాయ్), వేదం తెలిపిన (ఊట్రముడైయాయ్) మహాబలశాలీ, వేదం వల్లకూడా తెలుసుకోవడం సాధ్యం కాని (పెరియార్) మహా మహి మాన్వితుడా,

ప్రపంచంలో (ఉలగినిల్) సకల చేతనా చక్షువులకు ప్రత్యక్షంగా నిలిచిన (తో ట్రం ఆయన్ నిన్ణ) తేజోరూపా (చుడరే), నిద్ర మేలుకో (తుయలెజాయ్), నీకు శత్రువులు (మాట్రార్) నీ ముందు బలాన్ని కోల్పో యి (ఉనక్కు వలితొలైందు) నీ ఇంటి వాకిట (ఉన్ వాశల్ కళ్) గతి లేక నిలిచి (ఆట్రాదువందు) నీ పాదాలను (ఉన్ అడి) స్తుతించినట్లు (పణియు మాపోలే) మేము (యామ్) నిన్ను స్తుతించి (పుగజున్దు) నీకు మంగళాశాసనం (పోట్రి) చేయడానికి వచ్చినాము (వందోమ్).

భారత సంస్కృతిలో ఆనాటి కాలంలో ఆర్థిక వ్యవస్థ పశువులు పాల చుట్టూ తిరిగేది. పాడిపంటలు పొంగి పొర్లితే సంపదే సంపద. పాడి పంటలే అసలు సంపద. ఉత్తరాంధ్రలో పశువులను ఇప్పటికీ సొమ్ములు అంటారు. నంద గ్రామంలో పాడిపశువులు చల్లని శ్రీకృష్ణ కరస్పర్శతో పెరిగినాయి.

తన వారికోసం ఎన్నో ఉపకారాలు చేస్తూ ఇంకా ఏదైనా చేయాలేమా అనుకుంటూ ఉండే శ్రీకృష్ణుని ఉదారభావం (వళ్లల్) ఆయన చల్లని చేతులు తాకిన ఆ ఆవులకు కూడా వచ్చింది. తనను పెంచుకుంటూ పోషిస్తున్న యజమానులకు ఎన్ని పాలైనా ఇవ్వాలని ఆవులు అనుకుంటూ కుండలు (ఏట్రకలంగళ్) నిండి పొంగి పొర్లినా (ఎదిర్ పొంగి మీదు అళిప్ప) పాలు స్రవింప చేస్తూనే (పాల్ శొరియమ్) ఉన్నాయట.

శ్రీకృష్ణుడు తన కరుణామృత క్షీరధారలనూ అదేవిధంగా కురిపిస్తాడు. ఉదారత్వం రావడమేకాక తాను తాకడం వల్ల పాడిపశువులు మరింత బలిష్ఠమైనాయట. పిండే పనే లేకుండా కుండలు నింపి పొంగి పొర్లేంతగా పాలను తమంత తామే స్రవిస్తున్నాయి ఆ ఉదార పశువులు. పొదుగుల నిండుదనం వల్ల అక్కడ పాత్రలు లేకున్నా పాలు ధారగా స్రవిస్తున్నాయట.

భగవంతుని ఔదార్యం అలా ప్రవహిస్తూ ఉంటుంది. నాకిది కావాలని అడగాలా వద్దా అనే సంశయం వస్తుంటుంది. కనీసం పొదుగు కింద కుండైనా పెట్టాలి కదా. భగవానుడికి అభిముఖుడై అడగాలి. గురువును సమీపించి నిలబడాలి. అవ్యా జంగా అడగకుండానే రక్షించే స్వభావం భగవంతుడికి ఉంది. కాని, నీ కుండ నిండలేదని సూచించడానికి అది పొదుగు కింద ఉండాలి కదా.

భగవదనుభవం కావాలనే కోరిక ఉండాల్సిందే. అది అడగాల్సిందే. నిత్యం విడిచి ఉండ లేని లక్ష్మీదేవి కూడా నిన్ను విడిచి ఉండలేనయా అని కోరుతూనే ఉంటుందట. ‘నిత్య సూరులు సదా పశ్యన్తి సూరయః’ ఎప్పు డూ భగవంతుడిని చూడాలని కోరుతూనే ఉంటారట. భగవత్ స్వరూప గుణవైభ వమనే పాల ను ఆచార్యులు వర్షిస్తుంటారు.

సంపన్నుడు నందగోపుడి ఇంట్లో మాధవుడిని నిద్ర లేపుతున్నారు ఆండాళ్, నీళాదేవి, గోపికలు. క్షీరాబ్దిలో శేషశాయి శ్రీవిష్ణువు ని కాదు, మా కోసం నందగోప కుమారునిగా జన్మించి మాతో ఉన్న నిన్ను లెమ్మని ప్రార్థిస్తూ ఉంటే మేలుకోవడం లేదేమిటి? నందగోపుని కీర్తించే మా కోసం, ఆయన గౌరవం నిలబెట్టడం కోసమైనా మావైపు చూడు.

ఆర్తితో పిలిచే మా పిలుపులు వినవా? నీ ఐశ్వర్యం వల్ల మా పిలుపు అందడం లేదా? పదేపదే బతిమాలుతున్నా ఆయన కదలడం లేదు. పశు సమృ ధ్దిగా ఉన్న వారెందరో ఈ ఊళ్లో ఉన్నా రు. నన్నే లేపుతున్నారని ఎందుకనుకోవాలి? అని శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడట. అది గమనించిన గోపికలు శ్రీకృష్ణునికి మాత్రమే పొసగే విశేషణాలతో కీర్తించడం ఆరంభించారు.