calender_icon.png 23 July, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం!

11-04-2025 12:00:00 AM

ప్రపంచ స్థాయిలో పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్లాస్టిక్ భూతం కలిగిస్తున్న తీవ్ర హాని ఇంతా అం తా కాదు. జీవజాతుల మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్న విషవ్యర్థాల కథకు తక్షణం ముగింపు పలకాల్సి ఉంది. ఇంగ్లాండులోని లీడ్స్ యూనివర్సిటీ పరిశోధకులు గత సంవత్సరం జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో ఏటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది.

ఇలా పుట్టుకొచ్చిన ప్లాస్టిక్ పదార్థాల నుం చి ఆవిర్భవించే వ్యర్థాల నియంత్రణ, సమ ర్థ నిర్వహణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కంకణబద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ కాలుష్యంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని కలిగి ఉన్నట్టు ‘నేచర్’ జర్నల్ తాజా అధ్యయనం తేల్చింది.

తర్వాతి స్థానాల్లో నైజీరియా, ఇండోనేషియా, చైనాలు ఈ పాపాన్ని పం చుకుంటున్నాయని లీడ్స్ విశ్వవిద్యాల యం పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో కలుస్తూ మానవాళి సహా ఇతర జంతుజాలానికీ పెనుముప్పును తెచ్చి పెడుతున్నాయి.

ఇందులో మన వాటా ఎక్కువగా ఉన్నందున దేశవ్యాప్తంగా కాలుష్య నియంత్రణకు ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన తరుణమిది. ఈ అధ్యయనం మేరకు ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో 5.2 కోట్ల టన్నులకు పైగా సరైన నిర్వహణ లేక బహిరంగ ప్రదేశాల్లో కాల్చి వేయటం వంటి చర్యలద్వారా వాతావరణంలో కలిసిపోతున్నది.

ఇలా అనాలో చితంగా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ను కాల్చడంతో విషతుల్యమైన కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు గాలిలో కలుస్తు న్నాయి. ఇవి గుండె, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకాలకు, నరాల సమస్యలకు దారి తీస్తున్నాయి.

అలాగే, మితిమీరిన ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) మనల్ని అన్ని వైపులా ఆవహిస్తున్నాయి. పర్వతాలు, అడవులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాల్లో ఇవి చేరిపోతున్నాయి. ఇలా మనం తినే తిండి నుంచి పీల్చే గాలిలో, తాగే నీటిలోనూ ఈ విష కాలుష్య అణువులు చేరుతున్నాయి.

ఉత్పత్తి అక్కడ, వినియోగం ఇక్కడ!

ప్రతి గంటకు సగటున మనం గాలిద్వారా 11.3 ప్లాస్టిక్ సూక్ష్మరేణువులను పీల్చుకుని అనారోగ్య ప్రమాదంలో పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అంతే కాక, పర్యావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ కాలుష్య భూతం అత్యంత ఎత్తయిన ఎవరెస్టు నుంచి అతి లోతైన మరియానా కం దకం (ట్రెంచ్) దాకా ప్రతి చోటునూ ఆవహిస్తోంది.

గమ్మత్తేమంటే ప్రపంచంలో అత్యంత అధికంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి ధనిక దేశాలు. కానీ, వాటిలో ఒక్కటికూడా టాప్ 90 కాలుష్య కారక దేశాల జాబితా లో లేవు. సుమారు 69 శాతం ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం కేవలం 20 దేశాల నుం చే వస్తోంది. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలే కావడం గమనార్హం! ధనిక దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వాటి నిర్వహణ సమర్థంగా సాగుతుండటమే ఇందు కు కారణంగా అధ్యయనకారులు చెబుతున్నారు.

భారతదేశంలో ఏటా 58 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను కాలుస్తున్నట్టు అంచనా. మరో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ పర్యావరణంలోకి (భూమి, నీరు, గాలిలోకి) వెళుతు న్నది. మొత్తంగా ఏడాదిలో సుమారు 90 లక్షల టన్నులకుపైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచాన్ని చుట్టుముడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. నైజీరియా (35 లక్ష ల టన్నులు), ఇండోనేషియా (34 లక్షల టన్నులు), చైనా (28 లక్షల టన్నులు) దేశాలు భారతదేశం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచంలోనే మిగిలిన రంగాల మాదిరిగానే ప్లాస్టిక్ కాలుష్యంపై కూడా ధనిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశా ల వాదన భిన్నంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ సమర్థవంతంగా చేయడం ప్రధానమని ధనిక దేశాలు వాదిస్తుండగా, ప్లాస్టిక్ ఉత్పత్తిని, వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలు వెతకాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి.

ఆ మధ్య మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తపరచినట్లుగా, మనం ప్రస్తుతం ప్లాస్టిక్ బాంబుపై కూర్చున్నాం. ఆ మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమైతే అణ్వస్త్రాలను మించిన ముప్పును భావితరాలు ఎదుర్కోక తప్పదు. ఇంతటి దుర్భర దుస్థితి దాపురించ కూడదంటే ఎవరికి వారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి గా తగ్గించాలి. సంబంధిత వ్యర్థాల నిర్వహణపట్ల పాలకులు, ప్రజలు, అందరూ సామాజిక బాధ్యతతో శ్రద్ధ వహించాలి. 

ప్రతి ఒక్కరిపైనా సమాన బాధ్యత

ఈ పెను విపత్తుకు ముగింపు పలికేందుకు జరిగిన అంతర్జాతీయ ఒప్పంద రూపకల్పనకు 170కి పైగా దేశాలు చర్చ లు జరిపాయి. కానీ, ఏకాభిప్రాయం కుదరకపోవడం దురదృష్టకరం. ఆ ఒడంబడిక చిత్తశుద్ధితో ఎంత త్వరగా సాకారమైతే ప్రపంచ జీవజాతులు, మానవ మనుగడ కు అంత మంచిది. ప్రమాదకర ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై మరింత లోతైన పరిశోధనలకు చేయూతనివ్వాలి.

ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం ద్వారా ఖర్చు తగ్గిస్తూనే, నాణ్యతను పెంచవచ్చనే విదేశాల అనుభవాలతో పాఠం నేర్చుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల సంపద సృష్టికి వినియో గించుకోవచ్చునని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇలా ప్రజల్లో విస్తృత అవగాహనకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కంకణబద్ధులైతేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. అంతేకాదు, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, ఆ వ్యర్థాలను బహిరంగంగా పారేయకుండా సరైన నిర్వహణకు అందజేయటం ప్రతి ఒక్కరి బాధ్యత. 

 మేకిరి దామోదర్