calender_icon.png 22 July, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టారిఫ్‌ల ట్రంప్

11-04-2025 12:00:00 AM

సుంకాల యుద్ధం అమెరికా, చైనాల మధ్యేనని ప్రపంచదేశాలకు స్పష్టమైన సందర్భమిది. తమ దేశంపై ప్రతీకారంగా 84 శాతం దిగుమతి సుంకాన్ని పెంచిన చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విపరీతంగా కోపమొచ్చింది. చైనాపై ఏకంగా 125 శాతం సుంకాలను పెంచేస్తూ నిర్ణయం ప్రకటించారు. సుంకాల యుద్ధం ఆ రెండు దేశా లకు పరిమితమైనట్లు కనిపిస్తున్నా, ఈ పరిణామాల నుంచి మిగతా దేశా లు బయట పడలేవు.

75 దేశాలకు సుంకాల అమలులో 90 రోజులు గడువు పొడిగించిన ట్రంప్, ఆ దేశాలతో అనుచితమైన భాషలోనైనా సంప్రదింపులకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. వాణిజ్యపరంగా చైనా స్నేహహస్తం ఇవ్వడాన్ని గమనిస్తున్న భారత్, అమెరికా సుంకాల గందరగోళాన్ని నిశితంగా పరిశీలిస్తున్నది. అమెరికా సుంకాల విధానంపై స్నేహ పూర్వకంగా, పరస్పరం లాభం చేకూరే విధంగా ముందుకు వెళ్లాలని భార త్ భావిస్తున్నది.

అందుకే ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నది. భారీ వాణిజ్యంతో, ఉత్పాదకతను ఇబ్బడిముబ్బడిగా కొనసాగిస్తున్న చైనా ను ఇప్పుడు ఏ దేశమైనా విస్మరించలేదు. ప్రపంచవ్యాప్తంగా చైనాకు ఇప్పుడు సప్లు చైన్ ఏర్పడింది. ఒక రకంగా ఆ దేశ వాణిజ్యం సాలెగూడు లా ప్రపంచాన్ని చుట్టేసింది. ఇరవై ఏళ్ల కిందటి చైనా వేరు. ఇప్పుడు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి పరిమాణం, ఆ రంగంలో  మిగతా దేశాల ఉత్పాదన అంతా కలిపినా అంతకంటే ఎక్కవే.

దీనిని అమెరికా, మిగతా దేశాలు ఎదుర్కొనే పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. 2023లో మిగతా దేశాల ఎగుమతులతో పోల్చితే చైనా నుంచి 65 శాతం లాప్‌టాప్స్, టాబ్లెట్లు ఎగుమతి అయ్యాయి. ఇక స్మార్ట్ ఫోన్లయితే ఎగుమతుల్లో 47 శాతం చైనావే. పీసీబీలు, మెమోరీ చిప్స్, ట్రాన్సిస్టర్ల ఎగుమతుల్లో చైనాకు ఎదురే లేదు.

అధిక జనాభా, తక్కువ శ్రమ విలువను అనువుగా మలుచుకుని ప్రపంచమార్కెట్లలో తమ వస్తూత్పత్తి వెల్లువను సాధించడంలో చైనా ఒక వ్యూహం ప్రకారం విజయం సాధించగలిగింది. అందుకే ఈ వాణిజ్య యుద్ధంలో చైనా నిమ్మళంగా ఉంది. ఇలా వాణిజ్య యుద్ధం చేసుకుంటే గెలుపు ఒకరికే దక్కదనీ చైనా భావిస్తోంది.

అమెరికా వందశాతం సుంకా లు వేసినా తమ కొంపలేమీ మునగవని చైనాకు తెలుసు. తమ ఉత్పత్తులు లభించకపోతే అమెరికా ఏమవుతుందో ఆలోచించుకోవాలన్న ధీమా చైనాలో కనిపిస్తోంది. అందుకే అమెరికా బెదిరింపులకు, ఒత్తిడికి తాము లొంగేది లేదని కరాఖండిగా చెపుతున్నది. సర్వీసుల రంగంలో ఎగుమతులను చైనా టార్గెట్ చేస్తే, అది అమెరికాకే నష్టం. చైనా ఇప్పుడు ధనవంత మైన దేశమే కాదు, శక్తివంతమైంది కూడా.

అమెరికాయే కాదు, ఏ దేశమైనా వాణిజ్యంలో చైనాను విస్మరించే పరిస్థితి లేదు. తక్కువ ధరతో మార్కెట్లలో వెల్లువెత్తుతున్న చైనా ఉత్పత్తులను కాదని చాలా దేశాలు మనుగడ సాగించలేని కాలమిది. అమెరికా, చైనా మధ్య ప్రధానంగా సాగనున్న వాణిజ్య యుద్ధాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలనే వ్యూహరచనలో మిగతా దేశాలు ఉన్నాయి.

సుంకాలు పెంచుతూ ప్రపంచదేశాలపై రంకెలు వేస్తున్న ట్రంప్‌కు ముంన్ముందు పోయేదేమీ లేదు. అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చి అతలాకుతలమైనా, ట్రంప్ మూడోసారి అధ్యక్షపీఠానికి పోటీ చేయడం కుదరదు కనుక ప్రస్తు త విధానాలపై వచ్చే ప్రజాతీర్పుతో ఆయనకు సంబంధం ఉండదు.