జీతాలు ఒకరికి.. జీవితాలు మరొకరివి
విధినిర్వహణలో లైన్మెన్ల నిర్లక్ష్యం
ఫిట్నెస్ లేకున్నా ఉద్యోగాలలో కొనసాగింపు
జేఎల్‌ఎంలు వచ్చినా లైన్మెన్లుగా వ్యవహరిస్తున్న ఆర్టిజన్లు
అవగాహన లేని వారితో పనుల నిర్వహణ
ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వైనం
మృతుడి కుటుంబాల స్థాయిని బట్టి ’ప్రాణం ఖరీదు’
విద్యుత్ శాఖలో ఇది పరిస్థితి
గజ్వేల్, మార్చి29: ప్రభుత్వ ఉద్యోగి అనగానే నెల అంతా కష్టపడి ప్రభుత్వ జీతాన్ని పొందడం అందరికీ తెలిసిందే. కానీ విద్యుత్ శాఖలో కొందరు మాత్రం జీతాలు తీసుకుం టూ వేరే వారి జీవితాలను తమ విధి నిర్వహణకు కోసం అంకితం చేయిస్తున్నారు. ఆ విధి నిర్వహణలో ఒక్కోసారి ఉద్యోగానికి ఎ లాంటి సంబంధం లేని అమాయకుల ప్రా ణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విద్యుత్ శాఖలో లైన్ మెన్ల విధి నిర్వహణ ఎంతో ముఖ్యమైనది.
లైన్ మెన్ లతో పాటు ఆర్టిజ న్లు కూడా లైన్ మెన్ విధులను కొన్ని ప్రాం తాలలో నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ లైన్ మెన్ ల నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫిట్నెస్ పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు. పరీక్షలు పూర్తయిన తర్వాతే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఖరారు చేస్తారు. అంటే లైన్ మెన్ విధుల నిర్వహణకు అన్ని విధాలుగా అర్హులు అయితేనే వారిని ఉద్యోగులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇన్ని విధాలుగా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి జూనియర్ లైన్ మెన్, లైన్ మెన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
కానీ పలు కారణాల వల్ల విధులు నిర్వహించలేకపోతే వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విధులు నిర్వహించలేకపోయినా అదే ఉద్యోగులు విధులలో కొనసాగుతున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కి సమస్యలను పరిష్కరించలేని ఉద్యోగులు ఇతరుల సహాయంతో పనులు చేస్తున్నారు. తెలిసి తెలియని సాంకేతిక నైపుణ్యంతో ఇతరులు పనులు నిర్వహించడంతో వారి ప్రాణాలు విద్యుత్ ప్రమాదాలు సంభవించి గాలిలో కలిసిపోతున్నాయి.
ప్రాణం పోతే ఆయా కుటుంబాలతో సిట్టింగ్ వేయడానికి అధికారులు సిద్ధం.. మృతుడి కుటుంబాల స్థాయిని బట్టి ’ప్రాణం ఖరీదు’
లైన్ మెన్ నిర్వహించాల్సిన పనులను ఇతరులు నిర్వహిస్తున్న క్రమంలో గడిచిన కాలంలో విద్యుత్ ప్రమాదంలో కోల్పోయారని తెలియగానే నష్టపరిహారం కోసం కుటుంబాల, కార్మిక పెద్దలతో సెట్టింగ్లు నిర్వహించి పోయిన ప్రాణాలకి ఖరీదు కట్టడం అధికారులకు పరిపాటిగా మారింది. విద్యుత్ మరమ్మత్తుల సమయంలో అర్హత లేని వారితో పనులు నిర్వహించడంతో పాటు విద్యుత్ మరమ్మతుల సమయంలో ఎల్ సి తీసుకున్నా కూడా విద్యుత్ సరఫరా కావడంతో అమాయక వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు కారణమైన వారిపై అరకొర చర్యలు తీసుకోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇటీవల శ్రీగిరిపల్లి గ్రామ సరిహద్దుల్లోని విద్యుత్ స్తంభంపై ఆర్టిజన్ కు బదులు అర్హత లేని వ్యక్తి పనులు నిర్వహించగా, హఠాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో పనులు నిర్వహించిన వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు విద్యుత్ షాక్కు సరైన కారణాన్ని అధికారులు తెలుసుకోకపోవడం గమనార్హం.
జేఎల్‌ఎంలు వచ్చినా లైన్ మెన్లుగా వ్యవహరిస్తున్న ఆర్టిజన్లు పట్టించుకోని విద్యుత్ శాఖ
లైన్ మెన్ల కొరత తీర్చడానికి ప్రభుత్వం జూనియర్ లైన్ మెన్ల నియామకాలు పూర్తి చేసింది. అయినా కూడా సబ్ స్టేషన్ లో పనిచేసిన ఆర్టిజెన్లు లైన్ మెన్లుగా కొనసాగుతుండగా, లైన్ మెన్లుగా అర్హతలు ఉన్న జూనియర్ లైన్మెన్లు కొన్ని ప్రాంతాల్లో సబ్స్టేషన్లలో ఆపరేటర్లుగా పరిమితమవుతున్నారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఈ విషయంలో పట్టించుకోక పోవడంతో జూనియర్ లైన్ మెన్లు ఉద్యోగ నియామకంలో పిఆర్సిని కోల్పోవడంతో నియామకమైన పనికన్నా తక్కువ స్థాయి పనులు నిర్వహించడం జూనియర్ లైన్మెన్లను ఆవేదనకు గురిచేస్తుంది.
ప్రభుత్వానికి ఈ విషయంలో జూనియర్ లైన్ మెన్లు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఆర్టిజన్లు, ఫిట్ నెస్ లేని లైన్ మెన్లు తమకు చేతకాక పోయినా జీతాలు తీసుకుంటూ విద్యుత్ శాఖకు సంబంధం లేని వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు. దీనివల్ల ఎన్నో ప్రాణాలు పోతున్న విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారి బాధ్యతరాహిత్యానికి నిదర్శనం గా నిలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




