calender_icon.png 21 August, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరాలా రూ.100 కోట్లు

21-08-2025 12:00:00 AM

-జీరో పొల్యూషన్ మాటున వసూళ్ల దందా

- డీలర్లు, దళారులు కలిసి డ్రైవర్లపై దోపిడీ

-ఆటోలు స్టాక్ లేవంటూ కృత్రిమ కొరత

-బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయాలు

-కొరవడిన రవాణా శాఖ అధికారుల నియంత్రణ

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఎప్పుడూ లేని విధంగా నగరంలో ఆటోలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఓ ఆటో కొనుగోలు చేయాలని చాలామంది యువత ఆశి స్తున్నారు. ఈ నేపథ్యంలో ఔటర్ లోపల ఉన్న నగర పరిధిలో కొత్తగా 60వేల ఆటోలకు రవాణా శాఖ ఇటీవల అనుమతులు ఇచ్చింది.

ఇందులో ఎల్పీజీ, సీఎన్జీ 20వేలు, ఎలక్ట్రిక్ ఆటోలు 25వేలు, పాత ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 25వేలు అవకాశం కల్పిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా కొత్త ఆటోలకు అనుమతి లేకపోవడంతో నగరంలో ఆటో డ్రైవర్లు ఎదురుచూపులకు ఎట్ట కేలకు తెరపడింది. అయితే ఇక్కడే కొందరు అవినీతిపరులు కొత్తగా మంజూరీ అయిన ఆటోల మాటున సొమ్ము చేసుకునే కార్యక్రమానికి తెరతీశారు.

దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆటోలపై నిషేధం తొలగించడంతో వీటికి ఉన్న డిమాండ్‌తో దాదాపు రూ. 100 కోట్ల మేర అక్రమంగా వసూళ్లు చేశారు. నిరుద్యోగులకు ఆటోల ద్వారానైనా ఉపాధి కల్పిం చాలని ఉన్న డిమాండ్‌తో పాటు కాలుష్యరహిత ఆటోలను తీసుకువచ్చి వారికి చేయూ తనిద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. అక్రమార్కులు మాత్రం వసూళ్లతో రెచ్చిపోయా రు. డీలర్లు, ఆటో ఫైనాన్సియర్లు కలిపి ఆటో డ్రైవర్లను దోపిడీ చేశారు. 

డీలర్లు, ఫైనాన్సియర్లు కుమ్మక్కై

నగర పరిధిలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోంది. కొందరు డీలర్లు, ఆటో ఫైనాన్షియ ర్లు కుమ్మక్కు దోచుకుంటున్నారు. ఒరిజనల్ ధర కాకుండా ఎక్కువ ధర చెల్లిస్తేనే ఆటోలు ఇస్తామని డీలర్లు బాహాటంగానే అంటున్నారని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. ఆటోల అసలు ధరపై రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు అధికంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోల పర్మిట్లు ఇవ్వ డానికి ఆర్టీఏ అధికారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను తీసుకుంటున్నారు. కానీ అప్లికేషన్లను డీలర్ల ద్వారానే పంపాలని, సంబం ధిత వ్యక్తికి ఆటో డ్రైవింగ్ ల్లైసెన్స్, ఆధార్ కార్డు ఉండి ఇప్పటివరకు ఆటో లేనివారికి మాత్రమే ఇవ్వాలని నిబంధనలు పొందుపరిచారు. ఆటో కావాలనుకునే వారు డీలర్ల వద్దకే వెళ్లి బుక్ చేసుకునాల్సి ఉంటుంది. డీలర్ల నుంచి వచ్చే దరఖాస్తులకు ఆర్టీఏ అధికారులు అప్రూవల్స్ ఇస్తారు. తర్వాత డబ్బు లు చెల్లిస్తే డీలర్లు కొత్త ఆటో డెలివరీ చేయాల్సి ఉంటుంది.

 అడ్డగోలుగా దోపిడీ

నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా డీలర్లు వ్యవహరిస్తున్నారని ఆటోడ్రై వర్లు వాపోతున్నారు. కొంతమంది డీలర్లు, ఆటో ఫైనాన్షియర్లు కుమ్మక్కు కొత్త ఆటోలు కొనుగోలు చేసే వారి నుంచి భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఎల్పీజీ ఆటోలు రూ. 2.70 లక్షలు,  సీఎన్జీ ఆటోలు రూ. 2.80 లక్షల వరకు ధర పలుకుతాయి.

ప్రభుత్వం వరమిచ్చినా డీలర్లు కరుణించకపోవడంతో మార్కెట్ ధర కంటే సుమారు రూ.50వేల నుంచి రూ. లక్ష వర కు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు భారీ డిమాండ్ ఉందని, లేట్ అయితే ఆటోలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన లిమిట్ అయిపోతుందని డీలర్లు మాయమాటలు చెప్పడంతో డ్రైవర్లు తొం దర పడుతున్నారు. ఈ అదనపు వసూళ్లకు తోడు హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట రూ. 10వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని అంటున్నారు. 

ముందే బుకింగ్

20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలు విక్రయించేందుకు అవకాశం ఉండటంతో డీల ర్లు, ఆటో ఫైనాన్సియర్లు కలిపి దందాకు తెర లేపారు. ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లను గాలించి వారికి అంతో ఇంతో ముట్టచెప్పి లైసెన్స్, ఆధార్ తీసుకుని వారి పేరిట ఆటోలు బుక్ చేస్తున్నారు. డీలర్లను ఆటో కావాలని సంప్రదించే వారి వద్ద ఆటోలు లేవని, కావాలంటే బ్లాక్‌లో ఇస్తామని కానీ ధర అధికంగా ఉంటుందని చెప్పి భారీగా అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు.

ఇప్పటికే ఈ విధంగా సుమారు రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభు త్వం ఇచ్చిన 20 వేల టార్గెట్‌ను దళారులు కుమ్మక్కై పూర్తి చేసేశారు. ఇప్పుడు ఆటోలు కావాలంటే ఆటో ఫైనాన్సియర్లను కలిస్తే తప్ప దొరికే పరిస్థితి లేదు. ఈ అక్రమాలపై కొందరు ఆర్టీఓలు ఆగ్రహంగా ఉన్నా.. కనీ సం వారిని డీలర్ల వద్ద స్టాక్ ఉందా లేదా అనే అంశాన్ని చెక్ చేసేందుకు కూడా ఉన్నతాధికారులు వెళ్లనివ్వరని కిందిస్థాయి అధి కారులు అంటున్నారు.

అందుకే డీలర్లు ఆ డింది ఆట పాడింది పాట అన్నట్లుగా మారిపోయిందని చెబుతున్నారు. కొందరు రాజకీ య నేతలు డీలర్లుగా అవతారం ఎత్తారని అందుకే వారికి ఇప్పుడు ఈ కొత్త ఆటోల వ్యవహారం కోట్లు కురిపించేలా మారిందని ఆర్టీఏ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇంత మంచి పథకం తీసుకువస్తే కనీసం పేద ఆటోడ్రైవర్లకు చౌకలో ఆటో అందకుండా చేస్తున్న డీలర్లు, ఆటో ఫైనాన్సియర్లపై అధికారులు చర్యలు తీసుకునేం దుకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

నేరుగా వెళ్తే ఆటోలు ఇవ్వడం లేదు

నేరుగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు చూపిస్తే సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలు స్టాక్ లేవని చెప్తూ తిప్పి పంపిస్తున్నారు. డీలర్లు, ఆటో ఫైనాన్సియర్లు కుమ్మక్కై ఫీల్డ్‌లో లేని డ్రైవర్ల లైసెన్సులు, ఆధార్ కార్డులతో రాత్రికి రాత్రే ఆటోలు బుక్ చేసి వేరే చోట బ్లాక్ చేసి పెట్టారు. స్వంతంగా వెళ్లిన వారికి రిజిస్ట్రేషన్లు ముగిసిపోయాయని కాబట్టి అవకాశం లేదని చెప్తున్నారు. వారు అడిగినంత అదనంగా చెల్లిస్తామని చెప్తే ఆటోలు ఇస్తున్నారు.

బినామీ పేర్లతో షోరూం యజమానులు ఆటోలు బుక్ చేస్తున్నా.. వారిపై కనీసం దాడులు చేసి స్టాక్ చెక్ చేసేందుకు కూడా రవాణా శాఖ అధికారులు రావడం లేదు. రూ. 2.70 లక్షలు ఉన్న ఎల్పీజీ ఆటోను రూ. 3.60 లక్షలకు, రూ. 2.80 లక్షలు ఉన్న సీఎన్జీ ఆటోను రూ. 3.80 లక్షలకు అమ్ముతున్నారు.

తగ్గించాలని ధర్నా చేశాం. కమిషనర్ పిలిపించి ఒరిజినల్ ధరకు అమ్మాలని ఆదేశించారు. అదే రోజు రాత్రికి రాత్రే బినామీ డ్రైవర్ల పేరుతో 20వేల ఆటోలను విక్రయించినట్లు చూపించారు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సీఎన్జీ, ఎల్పీజీ ఆటో కూడా లేదు. డీలర్లకు లాగిన్ అవకాశం ఇవ్వడం వల్లే ఈ అక్రమాలకు అవకాశం ఏర్పడింది.

రవిశంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎంఎస్