21-08-2025 12:45:23 AM
- పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
- వర్షాలతో తెగిపిన కల్వర్టులు చెడిపోయిన రోడ్లకు వేగవంతంగా మరమత్తులు చేపట్టాలి
- మంత్రి జూపల్లి కృష్ణారావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 20(విజయ క్రాంతి)వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్.పి. కాంతిలాల్ సుభాష్, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాగజ్ నగర్ అటవీ డివిజన్ అధికారి సుశాంత్, జిసిసి చైర్మన్ కొట్నాక తిరుపతి లతో కలిసి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరదల వల్ల జరిగిన నష్టాల నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏర్పడిన వరద నష్టాల నివారణపై అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైనందున వాగులు, ఒర్రెలు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాలు జలమయం అయ్యాయని, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖల పరిధిలోని రహదారులు, కల్వర్టులు, వంతెనలు, లో లెవెల్ వంతెనల వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడం కారణంగా ప్రజానీకానికి కొంత ఇబ్బంది జరిగిందని తెలిపారు.
వర్షాల వల్ల జిల్లాలో దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 6 వేల 4503 ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం జరిగిందని, సుమారు 3 వేల 100 మంది రైతులు పంటలను నష్టపోయారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పంట నష్టం, రైతుల వివరాలు నమోదు చేసి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని, సర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాటు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
జిల్లాలో పశు నష్టం, మేకలు, గొర్రెలు చనిపోవడం జరిగిందని, పశు వైద్యాధికారులు వాటి వివరాలతో నివేదిక రూపొందించి సమర్పించాలని, నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని రహదారులు కొంతమేర ధ్వంసం కావడం, అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిన చోట త్వరగా మరమ్మత్తులు చేపట్టి రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లు, గోడల వివరాలను అందించాలని తెలిపారు.
అధికారులు సమన్వయంతో పని చేసి వరద ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. దండే విటల్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సిర్పూర్- టి లో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి విద్యార్థులను ఇతర గురుకుల పాఠశాలలకు తరలించడం ద్వారా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అడ్డు పడుతుందని, ఇండ్ల నిర్మాణాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజులుగా కురిసిన భారీ వర్షం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. పంట నష్టం, రహదారులు, వంతెనలు, కల్వర్టుల మరమ్మత్తుల కొరకు అంచనాలు రూపొందించి త్వరగా మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. వరద పరిస్థితులలో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించడం జరిగిందని, ప్రజల తక్షణ సహాయం కోసం జిల్లా కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉండడం జరిగిందని తెలిపారు.
కోవా లక్ష్మి మాట్లాడుతూ ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకు వచ్చినందున అభినందనలు తెలుపుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని వట్టి వాగు, కొమురం భీం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, వట్టి వాగు కాలువలకు గండిపడి రైతుల చేనులలో నీరు రావడంతో పత్తి పంట నష్టపోయారని, రైతులను ఆదుకోవాలని తెలిపారు.
అంతకు ముందు కెరమేరి మండలంలోని పంటలను పరిశీలించారు. అనంతరం ఆసిఫాబాద్ మండలం రాజురా గ్రామానికి వెళ్లే రహదారిలో లెవెల్ వంతెనను మంత్రి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామానికి చెందిన సిడాం గంగు కు చెందిన మేకలు వర్షాల కారణంగా మృత్యువాత పడటంతో 1 లక్ష 50 వేల రూపాయల పరిహారం ప్రొసీడింగును బాధితులకు అందజేశారు.
మంగళవారం రాత్రి జైనురు మండలం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో బస చేసిన ఆయన విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై తెలుసుకున్నారు.ఈ కార్యక్రమాలలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, పిఆర్ ఈ ఈ కృష్ణ, ఆర్ అండ్ బి ఈ ఈ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్, డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.