calender_icon.png 11 September, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కడ అనుమతి లేకుండా షూటింగ్ చేశాం

11-09-2025 04:36:04 PM

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ‘లిటిల్ హార్ట్స్(Little Hearts)’ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణకు నోచుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీటీమ్ థ్యాంక్స్ మీట్‌ను ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన హీరోయిన్ శివానీ నాగరం నోరు జారింది. షూటింగుకు సంబంధించి చెప్పకూడని ఓ విషయాన్ని చెప్తూ నాలుక కరుచుకుంది. ఇది చెప్పొచ్చో లేదో.. అంటూనే ‘బెంగళూరులో అనుమతి లేకుండా ఓ గొరిల్లా షూట్ చేశామ’ని ఇంకా వివరంగా చెప్పబోతుంటే, అక్కడే వేదికపై ఉన్న నిర్మాత బన్నీ వాసు (ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్) ‘హే.. అలాంటి విషయాలు చెప్పొద్దు..’ అని వారించటంతో శివాని ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి, తన ప్రసంగాన్ని కొనసాగించింది. 

శివాని ఇంకా మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్’ సినిమాను మిగతా మీడియాతో పాటు మీమర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమాను ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూశామని చెబుతుండటం హ్యాపీగా ఉంది. రిలీజ్ ముందు మేము చెప్పినట్లే యూత్‌తోపాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. నేను కాత్యాయని క్యారెక్టర్‌లో బాగుంటానని అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మార్తాండ్‌కు థ్యాంక్స్. ఈ సినిమాను 35 రోజుల్లోనే షూట్ చేశాం. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ చేశారంటే చాలామంది నమ్మడం లేదు. మార్తాండ్ అంత బాగా రూపొందించాడు” అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు బన్నీవాసు, వంశీ నందిపాటి, హీరో మౌళి తనూజ్, డైరెక్టర్ సాయి మార్తాండ్, ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.

ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్యహాసన్ నిర్మాతగా వ్యవహరించారు. టాలీవుడ్ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ చేశారు.