11-09-2025 06:34:18 PM
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల కోసం హైదరాబాద్ లో స్మృతివనం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి(Former MLA Chada Venkat Reddy) డిమాండ్ చేశాడు. తెలంగాణలో కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర అని, సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తే బిజెపికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని వెంకటరెడ్డి హెచ్చరించారు. సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొతీరాంపూర్ బైపాస్ రోడ్డులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన అగ్ర నేతల్లో ఒకరైన బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బద్దం ఎల్లారెడ్డి విగ్రహం నుంచి సిపిఐ కోతిరాంపూర్, కమాన్, బస్టాండ్,తెలంగాణ చౌక్ మీదుగా వెంకటేశ్వర టెంపుల్ ముందు గల అనభర్ ప్రభాకర్ రావు విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనభేరి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సంధర్బంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న సాయుధ పోరాటం మరింత ఉధృతమవుతున్న తరుణంలో నైజాం నవాబు ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగిందన్నారు. బిజెపి నేతలు తెలంగాణ విమోచన దినమంటూ,కాంగ్రెస్ నేతలు సమైఖ్యత దినోత్సవమంటూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అది ముమ్మాటికీ తెలంగాణ విలీన దినోత్సవమేనన్నారు. చరిత్రను వక్రీకరించే నాయకుల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. 4500 మంది ప్రాణాలు పోగొట్టుకున్న త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందన్నారు.
హైదరాబాద్ లో అమరవీరుల కోసం స్మృతివనంతో పాటు రైతాంగ సాయుధ పోరాటంలో ఎన్ కౌంటర్లు జరిగిన స్థానంలో వారి స్మారక స్మృతివనాలతో పాటు స్థూపాలు ఏర్పాటు చేయాలని వెంకటరెడ్డి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి,పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్,గూడెం లక్ష్మీ,నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, వివిధ మండలాల కార్యదర్శులు బండ రాజిరెడ్డి, గోవిందుల రవి, చొక్కల్ల శ్రీశైలం, లంకదాసరి కల్యాణ్, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజు,మచ్చ రమేష్ బావండ్లపెల్లి యుగేందర్, కంది రవీందర్ రెడ్డి, చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్న స్వామి, బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, బీర్ల పద్మ, కొట్టే అంజలి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మావురపు రాజు, రామారాపు వెంకటేష్, పిట్టల శ్రీనివాస్, తేరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.