calender_icon.png 22 November, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ పచ్చిదగా!

17-08-2024 12:50:32 AM

  1. 1౦౦% మాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
  2. బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కొంతమంది రైతులకే చేసిందని, వందశాతం పూర్తయిందని కాంగ్రెస్ నేతలు చెప్పకోవడం పచ్చి మోసం, దగాకోరు తనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిప్పులు చెరిగారు. నిబంధనల పేరుతో అర్హులకు కోత పెడుతూ ఏదో ఘనకార్యం సాధించినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన రుణమాఫీ నిజమైతే కొడంగల్ నియోజకవర్గానికి గన్‌మెన్లు లేకుండా మీడియాతో కలిసి వెళ్లి రైతు వేదికలో చర్చ పెట్టాలని, ఒక్క రైతు అయినా తనకు వందశాతం రుణమాఫీ జరిగిందని చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి రుణమాఫీపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా సంపూర్ణంగా చేశామని చెప్పి రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. పిచ్చి మాటలు మాని రైతుల వద్దకు వెళ్తే వారు నీతో చెడుగుడు అడుతారని సీఎంను ఉద్దేశించి అన్నారు. ఇంత దిగజారుడు సీఎంను ఎక్కడా చూడలేదని విమర్శించారు.

‘రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేసిన రుణమాఫీ శతాబ్దపు అతిపెద్ద జోక్. స్వాతంత్య్ర భారతంలోనే కాంగ్రెస్ చేసిసన అతిపెద్ద మోసం. అర్హులైన సగంమందికి కూడా రుణమాఫీ చేయలేదు. డిసెంబర్ 9న ఒకే సంతకంతో రూ.౨ లక్షల మాఫీ చేస్తానని, కేసీఆర్ చేసిన రుణమాఫీ పొందిన రైతులు కూడా అర్హులని చెప్పారు. రూ.౨ లక్షల రుణమాఫీ చేయాలంటే  రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కలేశారు. ఒక ఏడాదిపాటు కడుపు కట్టుకుంటే తీరిపోతుందని గొప్పలు చెప్పారు. రుణమాఫీకి రూ.35 వేల కోట్లు కావాలని ప్రచారం సాధనాలు చెప్పగా, సీఎం రేవంత్ రూ.40 వేల కోట్లు కావాలని అన్నారు. ఆ తరువాత లెక్క మారి రూ.31 వేల కోట్లకే మంత్రివర్గం తీర్మానం చేసింది. ఎన్నికల ముందు అందరికీ రుణమాఫీ అన్నారు.

ఎన్నికల తరువాత కొందరికే చేస్తున్నారు. రైతులు రుణమాఫీ కాలేదని బాధపడుతున్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అన్నట్లుగా పని చేస్తున్నారు. 60 శాతం మందికి ఎగనామం పెట్టి ఏదో విధంగా మాఫీ చేశామని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసి అతిపెద్ద దగా చేస్తున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు. మార్పు పేరుతో రైతన్నలను నిలువునా ముంచారని, రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500, జాబ్ క్యాలెండర్, ఆటోవాలాలకు నెలకు రూ.౧౦౦౦ సాయం, వృద్దులకు రూ.4 వేలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు.

బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు అన్నారు.. క్యాబినెట్‌లో రూ.31 వేల కోట్లు అన్నారు.. మూడు విడుతల్లో ఇచ్చింది మాత్రం రూ.17, 934 కోట్లు. 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది అని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా ప్రెసిడెంట్ కాగలరని తాను కూడా పోస్టులు పెడతానని ఇటీవల జరిగిన కేజీఎఫ్ సభలో అన్నారని, అక్కడ ట్రంప్ సరిపోతలేడని రేవంత్‌ను పిలుస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామాలు కొత్తకాదు, రేవంత్‌రెడ్డికి మోసాలు కొత్తకాదని పేర్కొన్నారు.  

సీఎంకు ఏదో తెలియని బాధ ఉంది 

సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం సభలో మాట్లాడిన తీరు చూస్తే ఆయన సోదరులు దూసుకపోవడం, భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఎక్కువగా పర్యటనలు చేయడం, ఏఐసీసీ పెద్దలు పట్టించుకోవడంలేదని బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. బాక్రానంగల్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలియని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. లంకె బిందెలు, న్యూక్లియర్ చైన్, దిల్‌షుక్‌నగర్‌లో విమానం అంటున్నారని.. కచ్చితంగా మానసిక పరిస్థితి ఏదో అయినట్లు అనుమానం వస్తుందని ఎద్దేవా చేశారు.

గౌడన్నలకు మోకులు ఇచ్చి కల్లులో నీళ్లు ఎంత కలుపుతారో అన్నారని.. ప్రైవేటు టీచర్లు డిగ్రీ చదవలేదని అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మహిళలను కించపరుస్తున్నారని ఆరోపించారు. గురుకులాల్లో విద్యార్థులకు సక్రమంగా భోజనం అందించడం మండిపడ్డారు. రుణమాఫీ పథకం మోసమని భావించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖమ్మం సభకు రాలేదని, దీనికి హరీష్‌రావు రాజీనామా చేయాలని రంకెలు వేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ మొత్తం చేయకపోతే అవసరమైతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్‌లో తమిళ నాడు, ఒడిశా, బెంగాల్ వెళ్లి అక్కడ పార్టీలు నిలదొక్కున అంశాలను గుర్తించి బీఆర్‌ఎస్‌లో మార్పులు చేస్తామని తెలిపారు.    

కానిస్టేబుల్ యాదయ్యకు అభినందనలు

విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలు ప్రదర్శించి రాష్ట్రపతి శౌర్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ, కానిస్టేబుల్ యాదయ్యకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. శుక్రవారం ఎక్స్ వేదిక స్పందిస్తూ ఏడు కత్తిపోట్లు దిగి రక్తమోడుతున్నా చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు యాదయ్య చూపించిన తెగువ అసామాన్యమైందని కొనియాడారు. సమర్ధవంతమైన నాయకత్వంలో తెలంగాణ పోలీసులు శక్తివంచన లేకుండా ఎలా పనిచేశారో తెలియజేయడానికి ఈ ఉదంతం ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. తన వృత్తిపట్ల, ప్రజల బాగోగుల పట్ల యాదయ్య చూపించిన చిత్తశుద్ధి ప్రతి ఉద్యోగికి.. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. 

తెలంగాణ అక్క చెల్లెలను కించపరిచే ఉద్దేశం లేదు 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన శుక్రవారం స్పందించి యథాలాపంగా చేసిన కామెంట్స్‌కు విచారం వ్యక్తం చేస్తున్నట్లు  ఎక్స్ వేదికగా తెలిపారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని అన్నారు. సోదరీమణులకు మనస్థాపం కలిగితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా అని తెలిపారు. 

ఇస్రో బృందానికి అభినందనలు 

ఎస్‌ఎస్‌ఎల్వీ డీ3 రాకెట్ పరీక్షను విజయవంతం చేసినందుకు ఇస్రో బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసి దేశాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. రాకెట్ల ప్రయోగాల విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.