calender_icon.png 22 November, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు గవర్నర్‌గిరీ!

17-08-2024 12:53:58 AM

బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఖాయం 

కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి.. హరీశ్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా 

కవితకు త్వరలోనే బెయిల్.. రాజ్యసభ పదవి 

నా మార్కుకోసమే పంద్రాగస్టున రైతు రుణమాఫీ 

ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఒకటో తేదీనే వేతనాలు 

ఎస్సీ వర్గీకరణపై చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాం 

బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయంగానే చూస్తోంది 

తెలంగాణకు నిధులివ్వకుంటే ప్రజలే బుద్ధిచెప్తారు  

మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి  

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనమవటం ఖాయమని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారని తెలిపారు. కేసీఆర్ కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి, అల్లుడు హరీష్‌రావుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి ఇస్తారని చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారని, బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తర్వాత వారు బీజేపీ ఎంపీలుగా మారిపోతారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ విలీనం తర్వాత బెయిల్  వస్తుందని, ఆ వెంటనే ఆమెకు బీజేపీ రాజ్యసభ సీటు ఇస్తారని జోస్యం చెప్పారు. ఇప్పుడు తాను చెప్పిన వాటిని బీఆర్‌ఎస్ నేతలు ఖండించినా.. విలీనం జరగక మానదని సీఎం స్పష్టం చేశారు. 

నాడు ఖజానా అంతా కాంట్రాక్టర్లకే

రైతు రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు రిజర్వులో ఉంచామని, రుణమాఫీ కాని రైతులు కలెక్టరేట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ఒకే కుటుంబంలో వారికి రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. తన మార్కు ఉండాలనే పంద్రాగస్టు రోజున రుణమాఫీని ప్రకటించి అమలు చేసిన ట్లు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పథకం కూడా ఆగలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  ఆగమ్యగోచరంగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మెదటి తేదీనే జీతాలు ఇస్తు న్నామని తెలిపారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నిధులన్నీ కాంట్రాక్టర్లకే ఇచ్చారని, మిగతా విభాగాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఐటీ, ఫార్మా రంగాల్లో కంపెనీల స్థాపనకు హైదరాబాద్ అనుకూల ప్రదేశమని చెప్పారు. అమెరికాలో ఎక్కువగా తెలుగు ప్రజలే ఆదాయం పన్ను కడుతున్నారని, వాళ్లంతా ఇండియాలో ఎందుకు పెట్టు బడులు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. త్వరలోనే ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తారని తెలిపారు.

చంద్రబాబు నాకు సహచరుడే.. 

ప్రధాని నరేంద్రమోదీకి అహ్మదాబాద్, చంద్రబాబుకు విజయవాడ ఉందని.. మా క్యాపిటెట్ ఇన్వెస్ట్‌మెంట్ హైదరాబాద్ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి బడ్జెట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నిధులు తీసుకెళ్లారని, అందుకే మేం ఢిల్లీకి వచ్చి నిధు లు అడుతున్నామని చెప్పారు. ఉమ్మడి రాజధాని ఎపిసోడ్ ముగిసిందని, పార్లమెంట్ చేసిన చట్టంలో అదే ఉందని సీఎం స్పష్టంచేశారు. ‘చంద్రబాబు నాకు సహచరుడే. ఉమ్మడి అంశాలపై మొదటి విడతలో రాజకీయ, ఆధికారుల కమిటీ ఏర్పాటు జరిగింది. నాకు వ్యక్తిగతంగా అందరితో సంబంధాలు ఉన్నాయి. మోదీ, అమిత్‌షా, చంద్రబాబుతో పరిచయాలు ఉన్నాయి. ప్రధాని ఎవరున్నా ప్రతీ సీఎంకు పెద్దన్నే.

మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వొచ్చు, ఇవ్వొకపోవచ్చు.. అది ఆయన ఇష్టం. తాము చేయాల్సిన ప్రయ త్నం చేస్తాం. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయనప్పుడు రాజకీయంగా ఆ పార్టీని ప్రజలు నిలదీస్తారు’ అని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీని పీపీపీ మోడల్‌లో నడిపిస్తామని, చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియమించామని తెలిపారు. కంపెనీలకు  ఇండియాలోనే బెస్ట్ పాలసీని తీసుకొస్తామని వెల్లడిం చారు. హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం రాష్ట్రమంతటికీ నగరంతో కనెక్ట్‌విటీ ఉండటమేనని పేర్కొన్నారు.

నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు 

తన సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవని, ఎవరూ ప్రొటోకాల్ వాడటం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘వాళ్ల సొంత డబ్బులతో విదేశాలకు వెళితే ఎవరికేమి ఇబ్బంది? అమెరికాలో నా కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. నాకు ఏడుగురు సోదరులున్నారు. నేను సీఎం అయితే వారు ఇంట్లో కూర్చుంటారా?’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. 

* చంద్రబాబు నాకు సహచరుడే. ఉమ్మడి అంశాలపై మొదటి విడతలో రాజకీయ, ఆధికారుల కమిటీ ఏర్పాటు జరిగింది. నాకు వ్యక్తిగతంగా అందరితో సంబంధాలు ఉన్నాయి. మోదీ, అమిత్‌షా, చంద్రబాబుతో పరిచయాలు ఉన్నాయి. ప్రధానిగా ఎవరున్నా ప్రతీ సీఎంలకు పెద్దన్నే. మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వొచ్చు, ఇవ్వొకపోవచ్చు.. అది ఆయన ఇష్టం. 

 సీఎం రేవంత్‌రెడ్డి

పంటినొప్పికి, కంటినొప్పికి ఢిల్లీకి వచ్చారు కదా? 

తెలంగాణ నుంచి రాజ్యసభ సీటును కాంగ్రెస్ అధిష్ఠానం అభిషేక్ మనుసింఘ్వీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యక్తిని కాదని ఢిల్లీ వాళ్లకు ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను సీఎం తేలిగ్గా తీసుకొన్నారు. గతంలో పంటి నొప్పికి, కంటి నొప్పికి ఢిల్లీకే వచ్చారు కదా? ఆ మాత్రం వైద్యం చేసేటోళ్లు తెలంగాణలో లేరా? అని  కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, మీడియా సలహాదారు పదవులు ఎవరికిచ్చారో తెలియదా? అని మండిపడ్డారు. రాహుల్‌గాం ధీ అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తానని లేదంటే హైదరాబాద్‌కు వెళ్తానని సీఎం తెలిపారు. ‘కేసీఆర్‌కు హెలికాప్టర్ ఉంది. నాకు లేదు. నేను విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఢిల్లీకి వస్తుంటాను. కనెక్టింగ్ ప్లుటై లేకుంటే చాపర్ ఉపయోగిస్తాను’ అని తెలిపారు. 

పీసీసీపై అభిప్రాయం ఎప్పుడో చెప్పా.. 

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి ఎప్పు డో చెప్పినట్లు సీఎం తెలిపారు. అధిష్ఠా నం నిర్ణయం ప్రకారమే ఎంపిక ఉంటుందని, ఎవరికిచ్చినా అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఎలాంటి పదవి ఇవ్వవడం లేదని వస్తున్న వార్తలపై సీఎం స్పందిస్తూ.. హనుమంతరావును మించి న కాంగ్రెస్ విధేయుడు లేడు, పార్టీలో ఆయన సీనియర్ నేత అని కితాబిచ్చారు. వీహెచ్‌కు పదవి విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. సీనియర్లకు మంత్రి పదవులు దక్కాయని చెప్పారు. 

వర్గీకరణను అమలు చేస్తాం.. 

ఎస్సీ వర్గీకరణపై ఒక నిర్ణయం తీసుకున్నామని, అదే అంశాన్ని మ్యానిఫె స్టోలో పెట్టామని సీఎం గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై క్యాబినెట్ సబ్‌కమి టీ ఏర్పాటు చేశామని చెప్పారు. వర్గీకరణపై కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఎన్నికల ప్రచారంలో చెప్పారని, దాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. తాము తీసుకునే నిర్ణయం తెలంగాణకు సంబంధించినదని, దేశ  వ్యాప్తంగా ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నా రు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజునే అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మంద కృష్ణ మాదిగను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నా ఎలాంటి నిర్ణ యం వెల్లడించలేదని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ అంశం రాజకీయ రిజర్వేషన్ కాదని.. విద్యా, ఉద్యోగాల్లో మాత్రమేన ని తెలిపారు. రిజర్వేషన్లకు ఎంత మద్ద తు ఉందో.. వ్యతిరేకించే వారు కూడా అంతే ఉన్నారని తెలిపారు. బీజేపీ రాజకీయాలు చేస్తోందని, ఎన్నికల ముందు రామ మందిరంతో గెలవాలని చూస్తే 240 సీట్లే ఇచ్చారని విమర్శించారు. అక్బరుద్దీన్ తాను కాలేజీ రోజుల్లో మంచి మిత్రులమని, తాను మొదట్లో విద్యార్థి పరిషత్‌లో పని చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు సీనియర్లుగా ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.