19-06-2024 12:05:00 AM
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ‘మండల విద్యా వనరుల కేంద్రాలు’ శిధిలావస్థకు చేరువలో వున్నాయి. ప్రతీ ఏటా నిధులు మంజూరైనా మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని మండల విద్యా వనరుల కేంద్రం శిథిలావస్థ స్థితి ఒక ఉదాహరణ. కేంద్రం పై భాగం పెచ్చులు ఊడి సలాకలు సైతం బయటపడ్డాయి. కేంద్రానికి వచ్చే ఉపాధ్యాయులు భయభ్రాంతులవుతున్నారు.
వర్షాలకు ఎప్పుడు కూలిపోతుందో అనే ఆందోళనతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్నారు. రేగొండ అతిపెద్ద మండలం. నిత్యం ఏదో పని మీద ఉపాధ్యాయులు తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం వివిధ పాఠశాలలకు సరఫరా అయ్యే విద్యార్థులకు సంబంధించిన ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, జావా, బెల్లం ప్యాకెట్లు ఈ మండల విద్యా వనరుల కేంద్రంలోనే నిలువ చేస్తారు. గతంలో మండల స్థాయి టీచర్లకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించే వారు. ఇకనైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు మరమ్మతులు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా