calender_icon.png 21 August, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వ్యవహార శైలి’ ఇలా వుండాలి

19-06-2024 12:05:00 AM

కృతే ప్రతికృతిం కుర్యాత్, 

హింసేన ప్రతిహింసనం

తత్ర దోషో న పతతి, 

దుష్టే దౌష్ట్యం సమాచరేత్! 

 చాణక్య నీతి

‘ఉపకారికి ఉపకారం చేయాలి. అలాగే, హింసకు ప్రతిహింసయే మార్గం. దుష్టులతో దౌష్ట్యంగానే వ్యవహరించాలి.’ ఇది తప్పుకాదు అంటాడు చాణక్యుడు. ఉపకారం చేసిన వానికి ఉపకారం చేయడం సమంజసమే. కాని, మనం చిన్నప్పుడు చదివాం కదా, అపకారికి ఉపకారం నెపమెన్నక చేయాలని! అలా చేస్తే ఈనాడది పిరికితనంగా వ్యవహరించ బడుతుంది. క్షమాగుణం ప్రధానమైందే కాని, అర్హులను మాత్రమే క్షమించాలి. బలం బలాన్ని గౌరవిస్తుందే కాని బలహీనతను గౌరవించదు. నీవొక చెంపకొడితే మరొక చెంప చూపుతాననడం ఈనాడు మూర్ఖత్వంగా పరిగణించ బడుతుంది. 

అన్ని ధర్మాలలో కెల్లా అహింసయే ఉత్తమం. పవిత్రంగా ఉండండి. నిజాయితీగా ఉండండి. గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపండి. కష్టపడి పనిచేయండి. ఇలాంటి నీతులు మనమెన్నో విన్నాం. కాని, ఈ నీతులకు భిన్నంగా ప్రవర్తించిన వారూ విజయ సాధకులైనారు. ఫలితాన్నిబట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే నేటి కాలంలో మంచిగా ఉండగలగడం మంచిదే కాని, అది మన అసమర్థతకు ప్రతీక కావద్దు. మీరంటే ప్రాణాలర్పించే అనుచరులు, మిత్రులు ఉండడం మంచిదే. వారిని ఉచిత రీతిని గౌరవించాలి. కానీ, అతి చనువు ఈయవద్దు. దుష్టత్వాన్ని ఉపేక్షించ వద్దు. ఎవరికి ఏ విధంగా చెపితే అర్థం అవుతుందో అలాగే చెప్పాలని సూచిస్తున్నాడు చాణక్యుడు. 

పై సూక్తి ఒక సంస్థను నడిపించే నాయకునికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. నిజానికి ఒక సంస్థలో నాయకునికి స్వేఛ్చకన్నా బాధ్యతయే ఎక్కువ. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అనుసరిస్తుంది కాబట్టి, ప్రతిఘటించే వారిపట్లనైనా, ఆదరించే వారిపట్లనైనా ఒకటికి రెండుమార్లు వారి వ్యవహార సరళిని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. 

ఒక వ్యక్తి తానొక సంస్థకు నాయకునిగా నియమితుడయ్యాక తనవద్ద పని చేస్తున్న సహచరులను క్షణ్ణంగా అవగాహన చేసుకోవడం అవసరం. సహచరుల మనస్తత్వాన్ని పరిశీలించడం, వారి సామర్థ్యానికి తగిన విధంగా బాధ్యతలు అప్పగించడం అవసరం. సహచరులను గురించి సరైన సమాచారాన్ని సేకరించుకోవడం.. వారిని బృందాలుగా ఏర్పాటు చేయడం, వారు నిర్దుష్టంగా పని చేసే వాతావరణం కల్పించడం అవసరం. అందుకే, ‘మేనేజ్ మెన్ ఇన్ టీమ్స్ ఈజ్ మేనేజ్‌మెంట్’ అని (ఆంగ్లంలో) అంటారు.

నిజానికి సంస్థలోని ఎందరో ఉద్యోగులు, వారి కుటుంబాలు త్యాగాలు చేస్తేనే సంస్థ నిలదొక్కుకుంటుంది. సంస్థ నిలిస్తేనే ఉద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అలాంటి ఉద్యోగులను సరైన సమయంలో గుర్తించి వారికి ప్రత్యుపకారం చేయడం కూడా సంస్థ నిర్వాహకుని బాధ్యతగా గుర్తించాలి. అలాగే, సంస్థకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తిస్తూ వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. అంతేకాదు, తన సంస్థతో పోటీపడే సంస్థల నిర్వాహకుల వ్యవహార సరళిని కూడా అవగాహన చేసుకోవడం అవసరం. వారితో ఎలా ప్రవర్తించాలో నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి.

‘మిత్రులకన్నా శత్రువును దగ్గరకు తీయాలంటాడు’ రాబర్ట్ గ్రీన్ అనే రచయిత. శత్రువును ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలని అంటాడాయన. మిత్రులలో ఈర్ష్యా భావన త్వరగా చోటు చేసుకుంటుంది. మన దగ్గర చనువు తీసుకున్న మిత్రులు ఉపకారం చేసినట్లు నటిస్తూ మోసం చేసే అవకాశం ఉంది. అందుకే, అతిగా నమ్మొద్దు. మరి శత్రువును దగ్గరికి తీస్తే అతడు తనను తాను విశ్వాసపాత్రునిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు.

కష్టపడి, ఇష్టపడి, ప్రేమతో పని చేస్తాడు. మనకు కావలసిన విజయాన్ని అతనే సాధిస్తాడు. అలాగని, ‘హింసామార్గంలో ప్రతిఘటించే శత్రువును ఎట్టి పరిస్థితులలో కూడా విడిచిపెట్ట వద్దంటాడు’ చాణక్యుడు. ‘చేసిన మేలును గుర్తు చేసుకోవడం కృతజ్ఞత (కృత జ్ఞ). అది అవసరమే. కానీ, కృతఘ్నులను క్షమించడం మాత్రం మన బలహీనతగానే గుర్తించాలి’ అన్నది చాణక్య నీతి సూత్రం.