28-08-2025 12:52:06 PM
ఒకరు మృతి ,మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలు
ఇటిక్యాల: ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి వెళ్తున్న లారీ బలంగా ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.ఈ ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి స్టేజి సమీపంలోని 44 జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేట్ (జగన్) ట్రావెల్ బస్సును డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కకు ఆపుకున్నారు.వెనక నుంచి వేగంగా వెళ్తున్న లారీ ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వెనక సీటులో కూర్చున్న ప్రయాణికుడు మృతి చెందగా మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.కాగా మృతి చెందిన వ్యక్తి హైద్రాబాద్ లోని అత్తాపూర్ కు చెందిన ధీరజ్ గా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.