calender_icon.png 28 August, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద

28-08-2025 12:50:21 PM

ఇన్ఫ్లో రెండు లక్షల 40వేల క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు.

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు.

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టులోకి( Nizamsagar project) రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులో ఎన్నడూ లేనంతగా ప్రమాద స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టులోకి 2,40,000 క్యూసెక్కుల   వరద నీరు వచ్చి చేరుతుండగా 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈ ఈ సొలొమాన్ తెలిపారు.,మంజీర నదికి భారీగా వరద వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నది పరీవాహక ప్రాంత గ్రామాలకు ముంపు పొంచి ఉందని అధికారులు సైతం ప్రకటించడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ నేపథ్యంలో నిజాంసాగర్ మండలంలోని మర్పల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి తరలించారు. అలాగే నిజాంసాగర్ మండల కేంద్రంలోని చిన్న పూల్​ వంతెన పైనుంచి నీరు పొంగిపొర్లుతోంది. దీంతో నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా నవోదయ పాఠశాల, ఆదర్శ పాఠశాలలో గల వసతి గృహ విద్యార్థినులు అందులోనే ఉండిపోయారు. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.