11-04-2025 12:00:00 AM
మనిషిని మనిషిగా చూసిన మనిషి
అసత్యాన్ని అసత్యంగా
సత్యాన్ని సత్యంగా శోధించిన మనిషి
స్వచ్ఛమైన మనిషి, అచ్చమైన మనిషి
మట్టిమనిషి, మహామనిషి.
అంటరాని చీకటిని,
ముట్టరాని మంటల్ని
ప్రశ్నించిన మనిషి
కుటిల వేదాల్ని, పూజారి
దోపిడీతనాన్ని
నిలదీసిన మనిషి
మోసాల పురాణాల్ని
మత్తులో ముంచెత్తె
మంత్ర స్త్రోత్రాల్ని
కడిగి పారేసిన మనిషి
అశాస్త్రీయతకు ఎదురీదిన మనిషి
సకల అంధ విశ్వాసాల నిర్మూలనకు
జ్ఞానమే వెలుగని
దశదిశల బోధించిన మనిషి
సమతకు, మమతకు పాదులు తీసి
సామాజిక న్యాయసాధనకు
సత్యాగ్రహమై పోరాడిన మనిషి
నిజాల్ని, నిప్పులుగా
మండించిన మనిషి
మూఢనమ్మకాల పెనుచీకట్లపై
చైతన్యాన్ని రగిలించిన మనిషి
దశావతారాల దుర్మార్గాలను
ఖండికలుగా ఖండించిన మనిషి
సత్యాన్ని సూర్యుడిలా
వెలిగించిన మనిషి
రాక్షసులని, దస్యులని, దయ్యాలని
మహార్లని, మాంగులని, మార్లని
విభజించి పాలించి హిసించిన
మరాఠా పీశ్వాల బాజీరావులపై
సత్యశోధక సమరనాదం
చేసిన మనిషి.
మానవతను బోధించి
ప్రజాహక్కులను ఎరుక చేసిన మనిషి
గులాంగిరీ విముక్తి లేనిదే
బహుజనులకు ముక్తిలేదన్న మనిషి.
చరిత్రకు కావడి గట్టి
చరిత్రను నిలబెట్టిన మనిషి
అంటరాని బాలికలకు
బడులు నాటిన మనిషి
వితంతువుల పునర్వివాహాలను
స్వాగతించిన మనిషి
భ్రూణహత్యలు, శిశుహత్యలకు వ్యతిరేకంగా
శరణాలయాలను నిలబెట్టిన మనిషి
బాల్యవివాహాలు,
మద్యపాన నిషేధాలకై
నిరంతరం పోరాటమై
నినదించిన మనిషి
కాళ్ళకు కత్తులు కట్టుకొని
కాటేస్తున్న కులోన్మాదాన్ని
కూకటేళ్ళతో పెకిలించిన మనిషి
వాకిట్లనే చేదురు బావితోడి
దళితులకు మంచినీళ్లు
పంచిన మనిషి
కర్మ సిద్ధాంతం కాదు,
బతుకు సిద్ధాంతం కావాలని
తలరాతలు కాదు బతుకు రాతలు
మారాలన్న మనిషి
బ్రాహ్మాణాధిపత్యాన్ని,
మనువాదాన్ని నిరసిస్తూ
సమాజాన్ని చైతన్యం చేసిన మనిషి
కిందికులాల వికాసానికై
మహావృక్షంలా నిలబడ్డ మనిషి
బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతికై
నదిలా ప్రవహించిన మనిషి
బ్రాహ్మణ మిత్రుని
పెళ్ళి ఊరేగింపులో
సనాతన వాదుల ఆగ్రహానికి
గురైన మనిషి
ప్రశ్నల్ని మొలిపించి
హక్కుల్ని సాధించిన మనిషి
అజ్ఞానానికి, అనాగరికానికి
సకల అంధకారాలకు
విద్యనే ఆయుధమన్న మనిషి
నిర్బంధ విద్యపై ఉద్యమమై
హంటర్ కమీషన్‌కు
విజ్ఞాపన పత్రమిచ్చిన మనిషి
విక్టోరియా మహారాణికి
రైతుల కష్టాలపై నివేదికతో
నిలదీసిన మనిషి
అతను శిలావిగ్రహాం కాదు
శూద్రాతి శూద్రుల బడులకై
ఇంటినుంచి గెంటేయబడ్డ మనిషి
రాత్రిబడులకు ముగ్గుపోసి
జ్ఞానమే వెలుగన్న మనిషి
కుటిల కుతంత్రాల నేలకు
కారుణ్యాన్ని నేర్పిన మనిషి
దురాచారాలపై సత్యాగ్రహమై
అభాగ్యులకు
శరణాలయమైన మనిషి
దళితుల దైన్యాన్ని
అక్షరమక్షరం కవిత్వమైన మనిషి
అగ్రవర్ణ అన్యాయాలపై
పదం పదం పాటై పోటెత్తిన మనిషి
కుడిచెయ్యికి సుస్తయితే
ఎడమ చెయ్యితో
సార్వజనిక్ సత్యధర్మ రాసిన మనిషి
ఎవరీ మనిషి, సామాన్యుడు గాదు
అసామాన్యుడు,
మానవతకు మహోన్నతుడు
మహాత్ములకే మహాత్ముడు
మహాజన సూర్యుడు
మహాత్మా జోతిరావు పూలే!
-వనపట్ల సుబ్బయ్య
9492765358