10-04-2025 12:00:00 AM
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి కొందరు గవర్నర్ల చర్యలు అవరోధంగా మారాయా అంటే అవుననే అంటోంది సుప్రీంకోర్టు. తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య కొన్నాళ్లుగా బాహాటంగానే సాగుతున్న వైరానికి సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. నిజానికి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఏకపక్ష ధోరణితో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించకుండా, రాజకీయ కోణంలో కొందరు గవర్నర్లు వ్యవహరిస్తుండటమే సమస్యను జఠిలం చేసింది. ఈ విషయంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు గవర్నర్ల విధివిధానాలకు మార్గదర్శనంగా ఉంది.
తమిళనాడు గవర్నర్‌గా రవి తీరు మొదటినుంచి వివాదాస్పదంగానే ఉంది. గత ఏడాది మార్చిలో, ఒక మంత్రిని తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకుంటానని, ఆమోదం తెలుపాల్సిందిగా ముఖ్యమంత్రి సిఫార్సు చేస్తే దానిని గవర్నర్ తిరస్కరించారు. దీనిని సుప్రీంకోర్టు గవర్నర్‌ను ఆనాడే తప్పు పట్టింది. ఇప్పుడు గవర్నర్ తనవద్ద సుదీర్ఘకాలంగా తొక్కి పట్టిన పది బిల్లులపై విచారణ సాగించి గవర్నర్‌ల వ్యవస్థపై గీటురాయి వంటి తీర్పును ఇచ్చింది. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారం ఇవ్వలేదనేది సుప్రీం తీర్పులోని ప్రధానాంశం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఉండే అధికారాన్ని గుర్తించి ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్లు అడ్డు కాకూడదని స్పష్టం చేసింది.
బిల్లులపై కాలయాపన చేస్తూ వాటిని గవర్నర్ తన వద్దే ఉంచేస్తే అవి ఆమోదం పొందినట్లేనని తెలిపింది. తన వద్దకు వచ్చే బిల్లులను గవర్నర్ ఆమోదించవచ్చు, ఆమోదించక పోవచ్చు, రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు లేదా మరోసారి సమీక్షకు శాసనసభకు పంపించవచ్చు. ఇవేవీ చేయకుండా తమిళనాడు గవర్నర్ పది బిల్లులను తొక్కిపట్టి వుంచారు. అందులో ఒకటి 2020 జనవరి నుంచి రాజ్‌భవన్‌లోనే మగ్గుతోంది.
రాజకీయ కోణంలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలకు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ తన పావులను గవర్నర్లుగా నియమించినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నదనేది వాస్తవం. కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో గతంలో ఇదే జరిగింది. ఇలాంటి పరిణామాలతోనే గవర్నర్ వ్యవస్థ అంటూ ఒకటి అవసరమా అనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రాంలాల్ బర్తరఫ్ చేసినప్పుడు ఆ వ్యవస్థపై దుమారం చెలరేగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ తన వద్దకు వచ్చే బిల్లులపై కాలపరిమితితో వ్యవహరించాలన్న నిబంధన స్పష్టంగా ఏర్పడింది.
శాసనసభ తీర్మానించి పంపిన బిల్లును గవర్నర్లు నెలరోజులకు మించి పెండింగ్‌లో పెట్టొద్దు. ఒకవేళ రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును పంపాల్సి వస్తే నెలరోజుల్లోనే పంపాలి. ఒకవేళ బిల్లుకు తన సమ్మతి లేకపోతే ఆ విషయాన్ని తెలుపుతూ, మూడు నెలల్లోగా బిల్లును తిప్పి పంపాలి. తను తిప్పి పంపిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపితే గవర్నర్ ఇక చేసేదేమీ ఉండదు. నెలలోపు ఆ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో విజయం సిద్ధించిందనే చెప్పాలి. తమిళ నాడులో వీసీల నియామకానికి మార్గం సుగమమైంది. వర్సిటీలకు చాన్స్‌లర్‌గా సీఎం వ్యవహరించడానికి కూడా సుప్రీం తీర్పు ఆమోదించింది.